ప్రకృతి నడుమ భారత క్రికెటర్‌ 5 బెడ్‌రూమ్‌ల విల్లా.. ఫొటోలు వైరల్‌ | Inside Rahane 5BHK Igatpuri Beautiful Perfect villa Stay Cost Pics Viral | Sakshi
Sakshi News home page

పచ్చదనం, కొండల మధ్య భారత క్రికెటర్‌ అద్భుతమైన 5 బెడ్‌రూమ్‌ల భవనం!

Sep 22 2026 5:05 PM | Updated on Sep 22 2026 5:12 PM

Inside Rahane 5BHK Igatpuri Beautiful  Perfect villa Stay Cost Pics Viral

కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం.. చుట్టూ కొండలు.. ఆ పక్కనే వైతరణ సరస్సు.. నగర జీవనానికి దూరంగా ప్రకృతి మధ్యలో ఐదు పడక గదులతో కూడిన ఆధునిక, అందమైన భవనం.. లోపల కళ్లు చెదిరే ఇంటీరియర్‌.. పచ్చటి గడ్డితో కూడిన బాల్కనీ.. ఊహించుకుంటుంటూనే ఎంతో బాగుంది కదా!!

విలాసవంతమైన విల్లా
ఈ విలాసవంతమైన బంగ్లా టీమిండియా మాజీ క్రికెటర్‌ అజింక్య రహానేకు సొంతం. మహారాష్ట్రలోని ఇగత్‌పురిలో రహానే, అతడి భార్య రాధికా దోపవ్‌కర్‌ ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. ముంబై నుంచి దాదాపు వందకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న భవంతికి రాయా ఎస్టేట్‌గా రహానే దంపతులు నామకరణం చేశారు.

పచ్చని ప్రకృతి నడుమ
సహ్మాద్రి పర్వతావళిలో భాగమైన కొండలు, పచ్చని ప్రకృతి నడుమ ఐదు బెడ్‌రూమ్‌లతో దీనిని నిర్మించారు. రహానే తన కుటుంబ సభ్యులతో కలిసి సెలవు రోజుల్లో పట్టణ జీవితానికి దూరంగా సరదాగా గడిపేందుకు ఈ హాలిడే హోంను కట్టుకున్నారు. ఇందులో ఐదు కింగ్‌సైజ్‌ బెడ్‌రూమ్‌లతో పాటు.. స్విమ్మింగ్‌ పూల్‌, మొదటి అంతస్తులో గార్డెన్‌లో కూర్చుని పరిసరాల అందాలు వీక్షించేందుకు వీలుగా ఓ చిన్న నిర్మాణం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

ఇక ప్రతీ బెడ్‌రూమ్‌ బాల్కనీతో అనుసంధానమై ఉంటుందట. అక్కడి నుంచి పర్వతాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. కోవిడ్‌ తర్వాత రహానే ఈ భవాన్ని నిర్మించుకున్నాడు.

పిల్లలకు ఆ అనుభూతి ఇచ్చేందుకు
తన బాల్యంలో బామ్మ దగ్గరికి వెళ్లి గడిపేవాడినని.. ఇప్పుడు సిటీలో అలాంటి వాతావరణం లేనందున తన పిల్లల కోసమే ఈ హాలిడే స్పాట్‌ను ఎంచుకున్నట్లు రహానే తెలిపాడు. ఇక ఈ భవనంలో ఇంటీరియర్‌ కూడా చక్కగా ఉంది. ఆహ్లాదకరమైన రంగులతో కూడిన సౌకర్యవంతమైన సోఫాలు, రాజసంతో కూడిన కుర్చీలు ప్రత్యేక ఆకర్షణలు.

ఇందులో రహానేకు సంబంధించిన రికార్డులు, చిరస్మరణీయ విజయాలకు సంబంధించి విశేషాలతో కూడిన ఫొటోలతో ఓ గదిని నింపేశారు. అయితే, రహానే దీనిని కేవలం తన సొంత అవసరాల కోసం మాత్రమే వాడుకోవడం లేదు. దీనిని అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 

చాలా కాస్ట్‌లీ గురూ అంటారా?
రోజుకు 71,438 రూపాయలు చెల్లిస్తే.. 15 మంది సభ్యులతో కలిసి ఈ లగ్జరీ విల్లాలో స్టే చేయొచ్చు. రెంట్‌కు అదనంగా ఇతర పన్నులు కూడా ఉంటాయి. రహానే ఇలా తన హాలిడే విల్లాను అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందడంపై గురిపెట్టాడు. కెరీర్‌ సజావుగా సాగుతున్న వేళ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న మాదిరి ఈ హాలిడే హోంను రహానే నిర్మించుకున్నాడు.

టెస్టు స్పెషలిస్టు రహానే
మహారాష్ట్రకు చెందిన 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున 85 టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 5077 పరుగులు సాధించాడు. ఇందులో పన్నెండు శతకాలు ఉన్నాయి. ఇక 90 వన్డేల్లో 2962 పరుగులు చేసిన రహానే, టీ20లలో 375 పరుగులు సాధించాడు.

అయితే, ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో చిరస్మరణీయ విజయం అందించాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే వీడ్కోలు  పలికాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటికి 212 మ్యాచ్‌లు ఆడి 5367 పరుగులు సాధించాడు రహానే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement