ఫాలోఆన్ తప్పించుకున్న శ్రీలంక
తొలి ఇన్నింగ్స్‌లో 284 ఆలౌట్
సోనాల్ దినుషా సెంచరీ
సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయావకాశాన్ని సృష్టించుకుంది. అయితే మూడు రోజుల పాటు మ్యాచ్‌ను వెంటాడుతూ ప్రభావం చూపించిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. గరిష్టంగా 196 ఓవర్లు పడే అవకాశం ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ మూడో రోజు సోమవారం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
సోనాల్ దినుషా (168 బంతుల్లో 100; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, నిరోషన్ డిక్‌వెలా (115 బంతుల్లో 80; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది.
భారీ భాగస్వామ్యం...
తొలి సెషన్‌లోనే శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఐదు వికెట్లతో దెబ్బ కొట్టింది. లంక ఇన్నింగ్స్‌లో రెండో బంతికే మదుషంక (0)ను అవుట్ చేసి సిరాజ్ శుభారంభం అందించాడు. సుతార్ తన తొలి బంతికే చండీమల్ (4)ను వెనక్కి పంపించాడు. కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచిన ఉడారా (44 బంతుల్లో 27; 6 ఫోర్లు) వికెట్ కూడా సుతార్ ఖాతాలోకే చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కమిందు మెండిస్ (14)ను కుల్దీప్, ధనంజయ డిసిల్వా (21)లను జడేజా పెవిలియన్ పంపించి తామూ వికెట్ల ఖాతా తెరిచారు. భారత బౌలర్ల జోరు చూస్తూ లంక కుప్పకూలడానికి ఎంతోసేపు పట్టదనిపించింది.
లంచ్ సమయానికి స్కోరు 99/5 కాగా, ఆ తర్వాత డిక్‌వెలా, దినుషా ద్వయం ఆతిథ్య జట్టును గట్టెక్కించింది. 20 పరుగుల వద్ద డిక్‌వెలా ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌ను రాహుల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం డిక్‌వెలా, దినుషా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీ విరామానంతరం ఎట్టకేలకు ఈ జోడీని విడదీయడంలో భారత్ సఫలమైంది. ప్రసిధ్ బౌలింగ్‌లో డిక్‌వెలా వెనుదిరగ్గా, తక్కువ వ్యవధిలో లంక మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. మరోవైపు పట్టుదలగా ఆడిన దినుషా 167 బంతుల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే అదే స్కోరు వద్ద దినుషా ఆట ముగియగా, మరో పది పరుగులకు లంక ఆలౌటైంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: మదుషంక (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 0; ఉడారా (సి) జైస్వాల్ (బి) సుతార్ 27; చండీమల్ (సి) పంత్ (బి) సుతార్ 4; కమిందు (సి) గిల్ (బి) కుల్దీప్ 14; ధనంజయ (సి) రాహుల్ (బి) జడేజా 21; దినుషా (ఎల్బీ) (బి) జడేజా 100; డిక్‌వెలా (సి) పంత్ (బి) ప్రసిధ్ 80; నువాంతా (సి) గిల్ (బి) జడేజా 2; జయసూర్య (సి) జురేల్ (బి) సుతార్ 10; కుమార (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 10; ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల
పతనం: 1–0, 2–27, 3–53, 4–59, 5–90, 6–236, 7–243, 8–274, 9–274, 10–284.
బౌలింగ్: సిరాజ్ 9–3–29–1, ప్రసిధ్ 14–0–47–1, సుతార్ 21.4–1–76–4, కుల్దీప్ 14–0–65–1, జడేజా 21–5–57–3.
350: జడేజా 350 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్ తరఫున కుంబ్లే, అశ్విన్, కపిల్, హర్భజన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా జడేజా నిలిచాడు. బోథమ్, కపిల్, వెటోరి తర్వాత టెస్టుల్లో 350కి పైగా వికెట్లు, 4 వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలవడం విశేషం.


