సింధు ‘సిక్సర్‌’ కొడుతుందా! | PV Sindhu eyes record sixth World Championships medal | Sakshi
Sakshi News home page

సింధు ‘సిక్సర్‌’ కొడుతుందా!

Aug 17 2026 5:28 AM | Updated on Aug 17 2026 5:28 AM

PV Sindhu eyes record sixth World Championships medal

నేటి నుంచి వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ గత దశాబ్దన్నర కాలంగా తమదైన ముద్ర వేసింది. 2011నుంచి ప్రతీ టోర్నీలో కనీసం ఒక పతకమైనా భారత్‌ గెలుస్తూ వస్తోంది. ఇదే జోరును కొనసాగించే క్రమంలో సొంతగడ్డపై ఈ మెగా టోర్నీకి మన ఆటగాళ్లు సిద్ధమయ్యారు. నేటినుంచి ఆగస్టు 23 వరకు న్యూఢిల్లీలో వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.

 2009 (హైదరాబాద్‌) తర్వాత ఈ టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండో సారి. భారత స్టార్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో అత్యధిక (5) పతకాలు గెలిచిన ప్లేయర్‌గా జాంగ్‌ నింగ్‌ (చైనా)తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆరో పతకంతో శిఖరాన నిలిచే లక్ష్యంతో ఆమె బరిలోకి దిగుతోంది. ఇటీవల జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీ గెలిచిన ఆమె పూర్తి ఫిట్‌తో చక్కటి ఫామ్‌లో ఉంది. సెమీస్‌ చేరే క్రమంలో వాంగ్‌ జి యి, పుత్రి కుసుమవంటి ప్రత్యర్థులను ఆమె దాటాల్సి ఉంటుంది. 

మరో వైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడి కూడా పతకాన్ని ఆశిస్తోంది. గాయాలనుంచి కోలుకొని మళ్లీ కోర్టులోకి అడుగు పెడుతున్న ఈ జంటపై మంచి అంచనాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ షి యు ఖితో తలపడుతున్న ఆయుశ్‌ శెట్టి, ఇటీవల ఫామ్‌లో లేని లక్ష్య సేన్, మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా సంచలనంపై దృష్టి పెట్టారు. మహిళల డబుల్స్‌లో కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతూనే టోర్నీకి అర్హత సాధించిన గాయత్రి గోపీచంద్‌–ట్రెసా జాలీ ఎలాంటి ఫలితం సాధిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement