నేటి నుంచి ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్
భారత పురుషుల, మహిళల జట్లకు సులువైన ‘డ్రా’
లండన్: రెండేళ్ల క్రితం సాధించిన ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లున్నాయి. నేటి నుంచి మొదలయ్యే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌ష్ప్‌లో భారత జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించడమే తొలి లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకుల శ్రీజ ఈ మెగా ఈవెంట్‌కు అందుబాటులో ఉండటం లేదు.
ఈ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఆశలన్నీ మరో స్టార్ ప్లేయర్ మనిక బత్రా (ప్రపంచ 49వ ర్యాంకర్)తోపాటు యశస్విని ఘోర్పడే (ప్రపంచ 88వ ర్యాంకర్), దియా చిటాలె (ప్రపంచ 92వ ర్యాంకర్), సుతీర్థ ముఖర్జీ (ప్రపంచ 120వ ర్యాంకర్), సిండ్రెల్లా దాస్ (ప్రపంచ 175వ ర్యాంకర్)లపై ఆధారపడి ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన 16 ఏళ్ల సిండ్రెల్లా దాస్ ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపిన్న వయసు్కరాలిగా గుర్తింపు పొందనుంది. గ్రూప్–6లో ఉక్రెయిన్, ఉగాండా, రువాండా జట్లతో భారత్ ఆడనుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో ఉగాండా జట్టుతో భారత్ తలపడుతుంది.
అనంతరం బుధవారం ఉక్రెయిన్ జట్టుతో, గురువారం రువాండా జట్టుతో టీమిండియా పోటీపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు అర్హత పొందాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టుకు అంత కష్టమేమీ కాదు. మరోవైపు దిగ్గజం ఆచంట శరత్ కమల్ రిటైర్ కావడంతో... ఈసారి భారత పురుషుల జట్టు ఆశలన్నీ మానవ్ ఠక్కర్ (ప్రపంచ 38వ ర్యాంకర్), సత్యన్ జ్ఞానశేఖరన్ (ప్రపంచ 42వ ర్యాంకర్), మనుశ్ షా (ప్రపంచ 51వ ర్యాంకర్), హరీ్మత్ దేశాయ్ (ప్రపంచ 80వ ర్యాంకర్), పాయస్ జైన్ (ప్రపంచ 127వ ర్యాంకర్) ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి.
గ్రూప్–7లో స్లొవేకియా, ట్యూనిషియా, గ్వాటెమాలా జట్లతో భారత్ పోటీపడుతుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో ట్యూనిష్యాతో టీమిండియా ఆడుతుంది. అనంతరం బుధవారం స్లొవేకియా జట్టుతో, గురువారం గ్వాటెమాలా జట్టుతో భారత్ తలపడుతుంది. నేరుగా నాకౌట్ దశకు చేరాలంటే భారత్ గ్రూప్ ‘టాపర్’గా నిలవాలి. 2024 ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌ష్ప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు అర్హత పొంది తొలి రౌండ్‌లో వెనుదిరిగాయి. ఒకవేళ భారత జట్లు గ్రూప్ విజేతలుగా నిలవకపోతే... రెండో స్థానంలో నిలిచిన టాప్–6లో ఉండాలి. లేదంటే ఆఖరి అవకాశంగా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో విజేతగా ఉండాలి.


