source: X
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయానికి యువ బ్యాటర్ యశ్ ధుల్ సంచలన సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.
141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయ సెంచరీ బాదాడు. ధుల్ ఒంటిచేత్తో సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అతడికి మరో ఎండ్‌లో యుగల్ సైనీ (27 నాటౌట్) నామమాత్రపు అండగా ఉన్నాడు. సైనీతో కలిసి ధుల్ అజేయమైన 81 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.
అంతకుముందు ధుల్ సహ ఓపెనర్ సిద్దార్థ్ జూన్ (8)తో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ధుల్ ధాటికి సెంట్రల్ ఢిల్లీ 13.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత పురానీ ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ సమర్థ్ సేథ్ (32) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో అశ్విని చిల్లర్ (38), రోహన్ రాఠీ (46) బ్యాట్ ఝులిపించారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో మోనీ గ్రేవాల్ 3, ఖురానా 2, బరోకా ఓ వికెట్ తీశారు.
ధుల్ 2022 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అతడు 110 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో ధుల్ 4 మ్యాచ్‌ల్లో 229 పరుగులు చేశాడు. సగటు 76.33.
అదే ఏడాది అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్ జట్టులోనూ ధుల్ కీలక సభ్యుడు. అండర్-19 ప్రదర్శనల తర్వాత ధుల్‌ను భారత క్రికెట్‌లో భవిష్యత్ టాపార్డర్ బ్యాటర్‌గా పరిగణించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో చేసిన సెంచరీ అతడి కెరీర్‌ను మలుపు తప్పుతుందేమో చూడాలి.


