ఆఖ‌రి బంతికి అద్భుతం.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే క్రేజీ ర‌నౌట్‌ | Delhi Premier League 2026: Outer Delhi Warriors Win Super Over After Incredible Football Style Run Out | Sakshi
Sakshi News home page

DPL: ఆఖ‌రి బంతికి అద్భుతం.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే క్రేజీ ర‌నౌట్‌

Aug 5 2026 9:00 AM | Updated on Aug 5 2026 10:09 AM

Miracle After Misfield: Incredible Run-Out In Delhi T20 League Stuns Fans

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌-2026లో మంగ‌ళ‌వారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా న్యూఢిల్లీ టైగర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌కు అస‌లు సిస‌లైన క్రికెట్ మజా అందించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూఢిల్లీ టైగర్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

37 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి న్యూఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే వరుణుడు మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. మ్యాచ్ తిరిగి ప్రారంభయ్యాక న్యూఢిల్లీ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ హిమ్మత్ సింగ్, లక్షయ్ థరేజాలు చక్కదిద్దారు. 

ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.  హిమ్మత్ సింగ్ (25 బంతుల్లో 61 , 5 సిక్సర్లు, 4 ఫోర్లు), లక్షయ్ థరేజా (41 బంతుల్లో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.. ఫలితంగా  టైగర్స్ నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోరు సాధించింది. వారియర్స్ బౌలర్లలో సిద్ధాంత్ శర్మ (2/25) రాణించాడు.

అనంతరం లక్ష్య చేధనలో ఔటర్ ఢిల్లీ వారియర్స్‌కు ఓపెనర్ యజస్ శర్మ(25 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్‌తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ యజస్ మినహా మిగతా టాపర్డర్‌, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ వారియర్స్‌ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో ఏడో నంబర్ బ్యాటర్ మోను శుక్లా అద్భుతం చేశాడు. మోను కేవలం 17 బంతుల్లో 45 పరుగులు చేసి తిరిగి ఢిల్లీ వారియర్స్‌ను గేమ్‌లోకి తెచ్చాడు. 13 ఓవ‌ర్‌లో మోను ఔటైన‌ప్ప‌టికి క్రీజులోకి శివ‌మ్ శ‌ర్మ సైతం దూకుడుగా ఆడాడు.

ఆఖ‌రి బంతికి ఊహించని ట్విస్ట్‌!
ఈ క్ర‌మంలో ఆఖ‌రి ఓవ‌ర్‌లో వారియ‌ర్స్ విజ‌యానికి  9 పరుగులు అవసరమయ్యాయి. శివం శర్మ మొదటి బంతికి ఫోర్, రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతి నో-బాల్ కావడంతో వారియర్స్ ఈజీగా టార్గెట్ ఫినిష్ చేస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఫ్రీ హిట్ బంతికి కేవ‌లం సింగిల్ మాత్ర‌మే వ‌చ్చింది. 

నాలుగో బంతికి కూడా సింగిల్ రావ‌డంతో స్కోర్లు స‌మ‌మ‌య్యాయి. చివ‌రి రెండు బంతుల్లో వారియ‌ర్స్ తొలి విజ‌యానికి కేవ‌లం ఒక్క ప‌రుగు దూరంలో మాత్ర‌మే నిలిచింది. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ చోటు చేసుకుంది. అనుహ్యంగా ఐదో బంతికి సిద్ధాంత్ శర్మ రనౌట్ అయ్యాడు.

దీంతో ఆఖరి బంతికి వారియ‌ర్స్ గెలుపునకు 1 పరుగు కావాల్సి వచ్చింది.  క్రీజులోకి వ‌చ్చిన ప్రథమ్ సలుజా మిడ్-ఆఫ్ దిశ‌గా ఆడి సింగిల్ కోసం నాన్‌స్ట్రైక‌ర్ ఎండ్‌వైపు ప‌రిగెత్తాడు. అయితే మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హిమ్మత్ సింగ్ బంతిని స‌రిగ్గా అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌మ‌య్యాడు. 

సహనం కోల్పోయిన హిమ్మత్‌ బంతిని కాలితో త‌న్నాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను తాకింది. స్టంప్స్ కింద ప‌డేట‌ప్ప‌టికి బ్యాట‌ర్ క్రీజుకు దూరంగా ఉండ‌డంతో బ్యాట‌ర్ థ‌ర్డ్ అంపైర్ ర‌నాట్‌గా ప్ర‌క‌టించాడు. 

దీంతో మ్యాచ్ టై అయి సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. కానీ సూప‌ర్ ఓవ‌ర్‌లో మాత్రం న్యూఢిల్లీ టైగర్స్ ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది. వారియ‌ర్స్ నిర్ధేశించిన 21 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టైగ‌ర్స్ టీమ్ చేధించ‌లేక‌పోయింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement