న్యూ ఢిల్లీ వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) మూడో సీజన్ వేలం ఘనంగా ముగిసింది. రైజింగ్ స్టార్స్‌ను తీసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్న కొడుకు ఎంపికవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సెహ్వాగ్ చిన్న కుమారుడు 16 ఏళ్ల వేదాంత్ సెహ్వాగ్ ఈ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. ఇతడిని రూ. 1 లక్షకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. వేదాంత్ ఇప్పటికే అండర్-14, 16 టోర్నమెంట్లలో తన మార్క్ చూపించాడు. వేదాంత్ తండ్రిలా కాకుండా రైట్ ఆర్మ్ ఆఫ్-స్పిన్నర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు.
అదేవిధంగా సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను రూ. 3 లక్షల ధరకు వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఇతడు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక కోహ్లి అన్న కుమారుడు ఆర్యవీర్ కోహ్లిని రూ.1.2 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. ఆర్యవీర్ గత సీజన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
తేజస్విపై కాసుల వర్షం
ఇక మూడో ఎడిషన్ వేలంలో తేజస్వి దహియా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తమ 'రైట్ టు మ్యాచ్' కార్డును ఉపయోగించి అతడిని రూ. 40 లక్షలకు దక్కించుకుంది. గత డీపీఎల్ సీజన్‌లో దహియా దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా అతడికి ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా దక్కింది. ఈ ఏడాది సీజన్‌లో అతడు కేకేఆర్ తరపున అరంగేట్రం చేశాడు.
రంజన్‌కు జాక్ పాట్
అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్‌కు జాక్ పాట్ తగిలింది. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డ్‌ని ఉపయోగించి రూ. 17 లక్షలకు సార్థక్‌ను తిరిగి దక్కించుకుంది. గత సీజన్‌లో సార్థక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
9 మ్యాచ్‌ల్లో 449 పరుగులు చేసి సత్తాచాటాడు. ఐపీఎల్-2026 వేలంలో కూడా అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. మొత్తంగా తాజా వేలంలో 25 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు.


