తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ షి యుకీపై విజయం
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి అరంగేట్రం అదిరిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆయుశ్ శెట్టి ప్రపంచ నంబర్‌వన్ షి యుకీని బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. 73 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ పోరులో ప్రపంచ 22వ ర్యాంకర్ ఆయుశ్ 21–14, 13–21, 21–19తో టాప్ సీడ్ షి యుకీని మట్టికరిపించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
నిర్ణాయక మూడో గేమ్‌లో ఆయుశ్ 17–6తో 11 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లినా... షి యుకీ పట్టువదలకుండా పోరాడాడు. చివరకు ఆధిక్యాన్ని 20–19తో ఒక పాయింట్‌కు తగ్గించాడు. ఈ దశలో కీలకమైన ఒక పాయింట్‌ను ఆయుశ్ గెలిచి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. గతంలో షి యుకీతో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన ఆయుశ్ నాలుగో ప్రయత్నంలో గెలిచాడు.
సింధు 29 నిమిషాల్లోనే...
మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సింధు కేవలం 29 నిమిషాల్లో 21–7, 21–11తో సోఫియా నోబెల్ (ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించింది. ఈసారి సింధు పతకం సాధిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఆరు పతకాలు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... కవిప్రియ సెల్వం–సిమ్రన్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
గాయత్రి–ట్రెసా 21–9, 21–13తో పౌలా లోపెజ్–లూసియా రోడ్రిగెజ్ (స్పెయిన్)లపై, కవిప్రియ–సిమ్రన్ 22–20, 21–14తో నికోల్ కరుల్లా–కార్మెన్ మరియా (స్పెయిన్)లపై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో హరిహరన్–అర్జున్ జోడీ తొలి గేమ్‌ను 21–16తో నెగ్గి, రెండో గేమ్‌లో 6–4తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి జంట స్కాట్ గిల్డియా–పాల్ రేనాల్డ్స్ (ఐర్లాండ్) గాయంతో వైదొలిగింది.


