సాక్షి, న్యూఢిల్లీ: అశ్వగంధ వేళ్ల కషాయం వాడకంతో కాలేయం, మూత్రపిండాలపై ఎలాంటి దుష్ప్రభావాలు భావాలు ఉండవని నిర్ధారణయిందని కేంద్ర ఆయుష్ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 9 ప్రముఖ పరిశోధనా సంస్థలకు చెందిన 45 మంది నిపుణులతో కూడిన బృందం ఈ పరిశోధన చేపట్టిందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇందులో భాగంగా కోవిషీల్డ్ టీకా తీసుకున్న 18– 70 ఏళ్ల 1,200 మంది ఆరోగ్యకరమైన వయోజనులకు రోజూ 500 మిల్లీ గ్రాముల అశ్వగంధ వేళ్ల కషాయం ఇచ్చారని తెలిపింది. టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీల (రోగ నిరోధక శక్తి) పనితీరుపై ఈ కషాయం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని అధ్యయనంలో రుజువైందని వివరించింది.
24 వారాల పాటు జరిపిన ఈ అధ్యయనంలో లివర్ ఎంజైమ్‌లు, క్రియాటినిన్ వంటి పారామీటర్లు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. వైరస్–న్యూట్రలైజింగ్ యాక్టివిటీ 85 శాతానికి పైగానే నమోదైందని తెలిపింది. తమ పరిశోధన ఫలితాలు ఆయుర్వేద ఔషధాల సమర్థతను, భద్రతను మరింత బలోపేతం చేస్తాయని ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మరింత శక్తిమంతంగా ఎల్‌నినో!


