source: X
భారత్-ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాళ ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్ల హవా సాగింది. ఈ రోజు ఇరు జట్లకు చెందిన 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ ఆసీస్‌ను 174 పరుగులకే కుప్పకూల్చాగా.. అనంతరం భారత్ కూడా స్వల్ప తడబాటుకు లోనై 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసి, ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 136 పరుగులు వెనుకపడి ఉంది.
చెలరేగిన తన్మయ్
భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బౌలర్లు సత్తా చాటారు. ముఖ్యంగా స్పిన్నర్ తన్మయ్ బలోడా (25-11-32-6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన్మయ్‌తో పాటు అయాన్ అక్రమ్ (2-45), మోహిత్ ఉల్వా (1-38), ప్రియాన్షు సింగ్ (1-21) రాణించడంతో ఆసీస్ 174 పరుగులకే ఆలౌటైంది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన చార్లీ హెండర్సన్ టాప్ స్కోరర్‌గా కాగా.. నీల్ పటేల్ (31), జేకబ్ పీట్జ్ (26), ప్యాట్రిక్ సుల్లివాన్ (20), థామస్ వసియో (14) రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో, ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందని ఒక్క పరుగుకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ సాగర్ విర్క్ 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి కుషాగ్రా ఓఝా 13, కెప్టెన్ యశ్‌వర్దన్ చౌహాన్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. థామస్ వేసియో, స్పెన్సల్ గ్రీన్‌కు తలో వికెట్ దక్కింది.
కాగా, ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను భారత యువ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం జరిగిన తొలి టెస్ట్‌లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.
ఇదీ చదవండి: భారీ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం విండీస్ పర్యటనకు టీమిండియా..!


