భోపాల్: మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు సాగుతోంది. తొలి మ్యాచ్‌లో మలేసియాపై ఘనవిజయం సాధించిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... రెండో మ్యాచ్‌లో శనివారం 2–1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (30వ నిమిషంలో), సునెలిటా టొప్పో (34వ ని.లో) చెరో గోల్ చేశారు.
కొరియా తరఫున యంగెన్ హాంగ్ (56వ ని.లో) ఏకైక గోల్ చేసింది. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ పదే పదే గోల్ అవకాశాలు సృష్టించిన భారత ఫార్వర్డ్ ప్లేయర్ నవ్‌నీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ 3–0తో థాయ్‌లాండ్‌పై గెలవగా... చైనా, మలేసియా మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం తదుపరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ తలపడనుంది.


