విరాట్ కోహ్లిపై రవీంద్ర జడేజా సంచలన వ్యాఖ్యలు..! | Ravindra Jadeja Big Revelation Sparks Virat Kohli Captaincy Debate, Indirectly Questions His Handling Of Batting Role | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లిపై రవీంద్ర జడేజా సంచలన వ్యాఖ్యలు..!

Aug 16 2026 3:41 PM | Updated on Aug 16 2026 5:06 PM

Ravindra Jadeja Indirectly Fires Shots At Virat Kohli For His Mishandling

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో టీమ్ మేనేజ్‌మెంట్ తన బ్యాటింగ్ సామర్థ్యంపై నమ్మకం ఉంచలేదని పరోక్షంగా చెప్పిన జడేజా.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వెల్లడించాడు. 

జడేజా నేరుగా ఏ కెప్టెన్ పేరును ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు విరాట్ కోహ్లి భారత టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న కాలాన్ని గుర్తుచేస్తున్నాయి.

జడేజా 2012లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అతను ఎక్కువగా నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కానీ భారత జట్టులోకి వచ్చిన తర్వాత అతని బ్యాటింగ్ స్థానం క్రమంగా దిగజారింది.

8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది..!
సంజయ్ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ జడేజా తన బ్యాటింగ్ సామర్థ్యంపై తనకు మొదటి నుంచే నమ్మకం ఉండేదని చెప్పాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తన బ్యాటింగ్ సగటు 60కుపైగా ఉండేదని గుర్తుచేశాడు.

అయితే భారత జట్టులోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఎనిమిదో, తొమ్మిదో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అదే సమయంలో ఒక ఫాస్ట్ బౌలర్ తన తర్వాత బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్న దృశ్యం తనలో అనుమానాలు కలిగించేదని పేర్కొన్నాడు.

ఆ పరిస్థితుల్లో టీమ్‌కు నా బ్యాటింగ్‌పై నమ్మకం లేదా అనే భావన ఏర్పడేదని, దాంతో ఆత్మవిశ్వాసం దెబ్బతిందని తెలిపాడు.

కోహ్లి కెప్టెన్సీ కాలం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది..?
ఈ విషయమై జడేజా నేరుగా విరాట్‌ను విమర్శించనప్పటికీ.. అతని కెరీర్‌లో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఎక్కువసార్లు బ్యాటింగ్ చేసిన కాలంలో కోహ్లినే భారత టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో జడేజా 32 సార్లు ఎనిమిదో స్థానంలో, 12 సార్లు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 2014 న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా అతను తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఏడో స్థానానికి ప్రమోట్ చేయగా, వృద్ధిమాన్ సాహా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

నంబర్ 6లో అవకాశం రావడంతో మారిన పరిస్థితి
జడేజా తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని దేశవాళీ క్రికెట్‌లో చాలాకాలం క్రితమే నిరూపించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతను 220 ఇన్నింగ్స్‌లలో 8,337 పరుగులు చేశాడు.

అయితే భారత టెస్టు జట్టులో నాలుగో స్థానంలో అతనికి కేవలం ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే అవకాశం వచ్చింది. ఆ ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో 29 ఇన్నింగ్స్‌లలో 1,074 పరుగులు, ఏడో స్థానంలో 32 ఇన్నింగ్స్‌లలో 1,578 పరుగులు సాధించాడు.

కాలక్రమంలో జడేజా బ్యాటింగ్‌లో గణనీయమైన పురోగతి సాధించాడు. ఒత్తిడిని ఎదుర్కొంటూ టెస్టు మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగల సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement