గ్లాస్గో వేదికగా జరిగిన 11 రోజుల పాటు జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్-2026కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఘనంగా ముగిసినప్పటికి పలువురు విదేశీ అథ్లెట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. యుగాండా బాక్సింగ్ బృందంలోని నలుగురు బాక్సర్లు (నూహు బట్టే, ఏంజెల్ కటుషాబే, ఇబ్రహీం కెమిస్, ఎమిలీ నకలేమా) మంగళవారం జట్టుతో తిరుగు ప్రయాణం కావాల్సిన విమానాన్ని ఎక్కలేదు.
ఎన్‌బీఎస్ స్పోర్ట్స్ కథనం ప్రకారం.. సదరు బాక్సర్లు మెరుగైన శిక్షణ సదుపాయాలు, అవకాశాలు కోసం స్కాట్లాండ్‌లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అదృశ్యమైన క్రీడాకారుల ఆచూకీ కోసం స్కాట్లాండ్ పోలీసులు వెతకడం ప్రారంభించారు.
పాక్ బాక్సర్ మిస్సింగ్..
మరోవైపు ఈ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న పాకిస్తాన్ బాక్సర్ ఖుద్రతుల్లా కూడా అదృశ్యమయ్యాడు. దీంతో పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ మరోసారి విమర్శల పాలైంది. గతంలో పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల సందర్భంగానూ పాకిస్తాన్ బాక్సర్లు అదృశ్యమైన ఉదంతాలు నమోదు కాగా... ఇప్పుడు తాజగా ఖుద్రతుల్లా వ్యవహారం వెలుగు చూసింది.
‘పోటీల అనంతరం ఖుద్రతుల్లా కనిపించకుండా పోయాడు. అతడి పాస్‌పోర్ట్ టీమ్ మేనేజర్ వద్దే ఉన్నప్పటికీ అతడు మాత్రం అదృశ్యమయ్యాడు’ అని పాకిస్తాన్ ఒలింపిక్ సంఘం సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 2022 బర్హింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల సందర్భంగానూ పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ ఇలాగే అదృశ్యమయ్యారు.
2024లో ఇటలీలో జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో... ఆసియా పసిడి పతక విజేత జోహైబ్ రషీద్ అతడి రూమ్‌మెట్ విదేశీ కరెన్సీని దొంగలించి కనిపించకుండా పోయాడు. కాగా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాకిస్తాన్ ఏకైక కాంస్య పతకం సాధించింది. మొత్తం 36 మంది బృందం ఈ పోటీల్లో పాల్గొనగా... అందులో మహిళా బాక్సర్ ఫాతిమా జెహ్రా మాత్రమే మెడల్ గెలిచింది.


