PC: X
ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. మంగళవారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.
తొలుత ఓపెనర్లు మిచెల్ మార్ష్, ర్యాన్ రికెల్టన్ లండన్ స్పిరిట్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ హెడింగ్లే మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు. మార్ష్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, రికెల్టన్ కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 54 బంతుల్లోనే 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
తద్వారా పురుషుల హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ ఓడిగా మార్ష్-రికెల్టన్ రికార్డు సృష్టించారు. మార్ష్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటైనప్పటికి రికెల్టన్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు.
ర్యాన్ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(18 బంతుల్లో 5 ఫోర్లు,5 సిక్స్‌లతో 55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 100 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 241 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది.
విల్లీ మెరుపులు వృథా
భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(0), లువాన్-డ్రే ప్రిటోరియస్(5)లను రీస్ టోప్లే పెవిలియన్‌కు పంపాడు. లియామ్ లివింగ్‌స్టోన్ (13బంతుల్లో 34) కౌంటర్ ఎటాక్ చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఒకానొక దశలో స్పిరిట్ 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో లోయార్డర్ బ్యాటర్ డేవిడ్ విల్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.
అతడితో పాటు ఓవర్టన్(15 బంతుల్లో 27) దూకుడుగా ఆడాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లండన్ జట్టు నిర్ణీత వంద బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది.


