హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీ అయిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ గత సీజన్ వరకు మాంచెస్టర్ ఒరిజినల్స్‌గా ఉండింది. రీబ్రాండింగ్ అనంతరం ఈ ఫ్రాంచైజీ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ మారింది.
ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్‌కు సిస్టర్ ఫ్రాంచైజీ. సూపర్ జెయింట్స్ ఫ్యామిలీలో లక్నో, మాంచెస్టర్‌తో మరో సూపర్ జెయింట్ కూడా ఉంది. ఆ ఫ్రాంచైజీ పేరు డర్బన్ సూపర్ జెయింట్స్. ఈ ఫ్రాంచైజీ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉంది. దీనికి కూడా మార్క్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు కూడా మార్క్రమ్ పలు సందర్భాల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ ఏడాది హండ్రెడ్ లీగ్ వేలంలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ మార్క్రమ్‌ను 2 లక్షల పౌండ్లకు కొనుగోలు చేసింది. మార్క్రమ్ హండ్రెడ్ లీగ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మార్క్రమ్ నియామకంతో హండ్రెడ్ లీగ్ 2026కు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ సీజన్‌లో ఓ ఫ్రాంచైజీకి నియమితుడైన ఏకైక విదేశీ కెప్టెన్‌గా మార్క్రమ్ నిలిచాడు. మిగిలిన ఏడు ఫ్రాంచైజీలకు స్థానిక ఇంగ్లీష్ ప్లేయర్లే నాయకత్వం వహిస్తున్నారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌లో స్థానిక ఆటగాడు జోస్ బట్లర్ ఉన్నా, యాజమాన్యం మార్క్రమ్‌వైపే మొగ్గుచూపడం విశేషం.
మార్క్రమ్‌కు కెప్టెన్‌గా విశేష అనుభవం ఉంది. అతడు తన జాతీయ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే పలు ప్రైవేటు ఫ్రాంచైజీలకు కూడా సారథ్యం వహించాడు, వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు 2023, 2024 సీజన్లలో వరుసగా రెండు ఎస్‌ఏ20 టైటిళ్లను సొంతం చేసుకుంది. ఈ విజయాలే హండ్రెడ్‌లో అతడికి కెప్టెన్సీ అవకాశాన్ని తీసుకొచ్చాయి.


