పంత్- వార్నర్ (PC: BCCI)
ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ చేసిన పోస్ట్‌కు.. ఆ జట్టు మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. రిషభ్ పంత్‌ను ఆహ్వానిస్తూ పార్థ్ ఉద్వేగానికి లోనుకాగా.. ఇందుకు బదులిస్తూ వార్నర్ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్న ఎమోజీలు షేర్ చేశాడు. అంతేకాదు.. పంత్ మాజీ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించాడు.
రెండేళ్లకే వదిలేశారు!
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రిషభ్ పంత్... రెండు సీజన్‌లలోనే లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 27 కోట్లు పెట్టి పంత్‌ను కొనుగోలు చేసుకున్న లక్నో ఫ్రాంచైజీ... ఇప్పుడతడిని ఢిల్లీ క్యాపిటల్స్‌కు బదిలీ చేసింది.
బదులుగా అతడి స్థానంలో ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పంత్‌పై భారీగా ఖర్చు పెట్టినట్లు చెప్పిన లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా... రెండు సీజన్‌ల పాటు విఫలమవడంతోనే అతడిని వదిలేసుకున్నాడు.
ఢిల్లీ రూ. 15 కోట్లకే దక్కించుకుంది
ఐపీఎల్–2027 కోసం ఆటగాళ్ల మార్పిడి భాగంగా పంత్ పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 15 కోట్లకే దక్కించుకుంది. దీంతో పంత్ ఏడాదికి రూ. 12 కోట్లు నష్టపోయాడు. గత రెండు సీజన్‌లలో లక్నో జట్టుకు సారథ్యం వహించిన ఈ వికెట్ కీపర్... అటు బ్యాట్‌తోనూ ఇటు సారథిగానూ ఆకట్టుకోలేకపోయాడు.
పూర్తిగా విఫలం
పంత్ కెప్టెన్సీలో 28 మ్యాచ్‌లాడిన లక్నో జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలిచి 18 ఓడింది. ఇక 2025 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కలిసి 269 పరుగులు చేసిన రిషభ్... ఈ ఏడాది 312 పరుగులకు పరిమితమయ్యాడు. గతేడాది ఏడో స్థానానికి పరిమితమైన సూపర్ జెయింట్స్... ఈసారి పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచింది.
దీంతో సీజన్ ముగియగానే కెప్టెన్సీకి దూరమైన పంత్... ఇప్పుడు జట్టుకే వీడ్కోలు పలికి ఢిల్లీతో చేరాడు. కాగా 2016 నుంచి 2024 మధ్య ఎనిమిది సీజన్‌ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 111 మ్యాచ్‌లు ఆడిన పంత్... 2021 నుంచి 2024 వరకు 43 మ్యాచ్‌ల్లో క్యాపిటల్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. దీంతో అతడిని తిరిగి తీసుకునేందుకు ఢిల్లీ జట్టు ఆసక్తి కనబర్చింది.
అత్యుత్తమ ఫామ్ అందుకుంటావని ఆశిస్తున్నా
ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ కుల్దీప్‌నకు వీడ్కోలు పలుకుతూ.. పంత్‌ను తిరిగి ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన కుల్దీప్.. గత ఐదేళ్లుగా మాకు సేవలు అందించినందుకు ధన్యవాదాలు. జట్టులో నువ్వొక కీలక సభ్యుడివి. చాంపియన్ ప్లేయర్‌వి.
నీ సొంత మైదానంలో (లక్నో) మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. నేనూ.. కిరణ్ నువ్వు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నము రిషభ్. ఢిల్లీతో చేరిన తర్వాత నువ్వు అత్యుత్తమ ఫామ్ అందుకుంటావని ఆశిస్తున్నాము’’ అని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.
ఒకరు వదిలించుకున్నారు.. మరొకరు ఓపికతో దక్కించుకున్నారు
ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ వ్యంగ్య రీతిలో లాఫింగ్ ఎమోజీలు షేర్ చేశాడు. దీనిపై బజ్ క్రియేట్ కాగా.. కాసేపటి తర్వాత మరో ట్వీట్‌తో వార్నర్ ముందుకు వచ్చాడు. ‘‘ప్రతీసారీ ఇదే జరుగుతుంది. వేలంలో మనం అనుకున్న ఆటగాళ్లను కొనలేకపోవచ్చు.
అయితే, ఇతరులతో పోటీపడి కొనుక్కున్న యజమాని.. సదరు ఆటగాడు ఫామ్ కోల్పోగానే.. అతడిని వదిలించుకోవాలని అనుకుంటాడు. ఇక వేలంలో కొనుక్కోలేకపోయిన యజమాని.. ఓపికగా ఎదురుచూసి సరైన సమయంలో రంగంలోకి దిగుతాడు’’ అని వార్నర్ పేర్కొన్నాడు. తద్వారా వ్యాపారమే తప్ప యజమానులకు ఆటగాళ్లపై ప్రేమ, అభిమానం లాంటివి ఉండవని చెప్పకనే చెప్పాడు.
చదవండి: పాకిస్తాన్‌ను చిత్తు చేసి సెమీస్‌కు ఆసీస్
Dear Kuldeep thank you for your service over the last 5 years @DelhiCapitals you have been a core part of our team and you will be sorely missed. Go well - you are a champion player and i am sure you will do extremely well back in your home ground. Rishabh - Kiran and I are both…
— Parth Jindal (@ParthJindal11) June 23, 2026


