ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌! | Delhi and Lucknow set to swap players | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

Jun 20 2026 4:02 AM | Updated on Jun 20 2026 4:02 AM

Delhi and Lucknow set to swap players

ఆటగాళ్లను మార్చుకోనున్న ఇరు జట్లు 

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ వేలంలో రూ.27 కోట్ల విలువతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన రిషభ్‌ పంత్‌... లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టును వీడటం ఖాయమైంది. తాజా సీజన్‌ ముగిసిన వెంటనే కెప్టెన్సీని వదిలేసిన పంత్‌ ఇప్పుడు పూర్తిగా జట్టునుంచే తప్పుకుంటున్నాడు. ఐపీఎల్‌–2027 కోసం ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా పంత్‌ను తీసుకునేందుకు అతని పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ సిద్ధమైంది. అయితే దీని వల్ల పంత్‌ ఏకంగా రూ.12 కోట్లు నష్టపోనున్నాడు. నిబంధనల ప్రకారం అతనికి ఢిల్లీ రూ.15 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. 

తన విలువను తగ్గించుకొని ఢిల్లీకి వచ్చేందుకు పంత్‌ అంగీకరించినట్లు సమాచారం. పంత్‌కు బదులుగా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ లక్నో తీసుకుంటుంది. అయితే కుల్దీప్‌ ఫీజులో మాత్రం ఎలాంటి కోత ఉండటం లేదు. అతనికి ఢిల్లీ ఇచ్చిన మొత్తాన్నే (రూ.13.25 కోట్లు) లక్నో కూడా ఇవ్వనుంది. లక్నో తరఫున 2 సీజన్లు ఆడిన పంత్‌ పేలవ ప్రదర్శన కనబర్చాడు. 28 మ్యాచ్‌లలో కలిపి 26.4 సగటుతో 581 పరుగులు మాత్రమే చేసిన అతను ఒక సెంచరీ, 2 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. 

అతని కెప్టెన్సీలో 10 మ్యాచ్‌లో గెలిచి 18 ఓడిన జట్టు రెండు సార్లు ‘ప్లే ఆఫ్స్‌’కు చేరలేకపోయింది. 2016–2024 మధ్య ఎనిమిది సీజన్ల పాటు పంత్‌ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. మరో వైపు 2026 సీజన్‌లో పూర్తిగా విఫలమైన కుల్దీప్‌... 12 మ్యాచ్‌లలో 10 వికెట్లు మాత్రమే తీశాడు. ఢిల్లీ తరఫున ఐదు సీజన్లు ఆడిన కుల్దీప్‌ ఇప్పుడు తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కే చెందిన జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement