source: X
పురానీ ఢిల్లీ 6 స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ, వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ నితీష్ రాణా మధ్య గత సీజన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన వివాదానికి ఆసక్తికరమైన ముగింపు లభించింది.
గత సీజన్ ఎలిమినేటర్‌లో రాఠీ, రాణా ఒకరినొకరు కవ్వించుకోగా.. రాణా బ్యాట్‌తో పైచేయి సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు మరోసారి ఎదురెదురుపడగా.. రాణాను ఔట్ చేసి రాఠీ రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ ప్రతీకార పర్వం క్రికెట్ అభిమానులను అమితంగా ఆకర్షించింది.
వివరాల్లోకి వెళితే.. గత సీజన్ ఎలిమినేటర్‌లో రాణా-రాఠీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాఠీ బంతి వేయడానికి వచ్చి చివరి క్షణంలో ఆగడంతో రాణా కూడా అదే తరహాలో స్పందించాడు. ఆ తర్వాత రాఠీ బౌలింగ్‌లో రాణా భారీ సిక్సర్ కొట్టి, అతడి నోట్‌బుక్ సెలబ్రేషన్‌ను అతడికే అప్పజెప్పాడు.
ఆ మ్యాచ్‌లో రాణా 55 బంతుల్లో అజేయమైన 134 పరుగులు చేసి వెస్ట్ ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఆ వివాదానికి సంబంధించి అప్పుడు రాఠీ మ్యాచ్ ఫీజులో 80 శాతం, రాణా 50 శాతం జరిమానా విధించారు.
తాజాగా జరిగిన మ్యాచ్‌లో రాఠీ రాణాను ఔట్ చేసి, గత సీజన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 11వ ఓవర్ చివరి బంతికి రాఠీ వేసిన బంతిని రాణా రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు తగలకుండా ముందు ప్యాడ్‌కు తగలడంతో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రాణా కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు.
గత సీజన్ చెడు అనుభవం దృష్ట్యా రాఠీ సాధారణంగానే సంబరాలు చేసుకున్నాడు. తన స్టయిల్‌లో నోట్‌బుక్ సెలబ్రేషన్ చేసుకోలేదు. అతడు కామ్‌గానే ఉన్నా, పరోక్షంగా రాణాపై ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఈ ఉదంతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ 180 పరుగులు చేయగా.. పురానీ ఢిల్లీ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. పురానీ ఢిల్లీ విజయంలో దేవ్ లక్రా (64), అనూజ్ రావత్ (49 నాటౌట్), లలిత్ యాదవ్ (30 నాటౌట్) కీలకపాత్ర పోషించారు. రాఠీకి కేవలం రాణా వికెట్ మాత్రమే లభించింది.


