Photo Credit: Hundred Twitter
సాధారణంగా 100 బంతుల్లో 86 పరుగుల టార్గెట్ అంటే సునాయాసంగా ఊదిపారేయచ్చు. కానీ వెల్ష్ ఫైర్ జట్టు మాత్రం ఆ చిన్న టార్గెట్‌ను అందుకోవడానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా 3 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది. హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్‌లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌పై వెల్ష్‌ఫైర్ కష్టపడి విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. రియానా మెక్‌డొనాల్డ్ (18), స్మృతి మంధాన (15) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో ఎవరు పెద్దగా రాణించలేదు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో ఒర్లా ప్రెండెగాస్ట్ 4 వికెట్లతో చెలరేగగా, హెథర్ గ్రహమ్ 2 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్య ఛేదనలో వెల్ష్‌పైర్ కూడా పూర్తిగా తడబడినప్పటికీ మరో 9 బంతులు మిగిలి ఉండగా 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అయితే ఒక దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వెల్ష్‌ఫైర్‌ను హెథర్ గ్రాహం (16 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఓపెనర్లు జార్జియా వోల్ (16), సారా బ్రైస్ (16) రాణించారు. మాంచెస్టర్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ 3 వికెట్లు తీయగా, రెబెక్కా టైసన్, మాడీ విల్లర్స్, కేథరిన్ బ్రైస్ తలా ఒక వికెట్ తీశారు.
కాగా వెల్ష్‌ఫైర్‌కు ఇది ఆరు మ్యాచ్‌ల్లో మూడో విజయం కాగా, మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌కు రెండో పరాజయం. 14 పాయింట్లతో మాంచెస్టర్ జెయింట్స్ మూడో స్థానంలో ఉండగా, వెల్ష్‌ఫైర్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


