PC: Instagram
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)-2026 టోర్నమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ ఇఫ్తికార్ అహ్మద్ అసాధారణ రీతిలో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘ఇదెక్కడి చోద్యంరా బాబూ’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌హల్ చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే.. 35 ఏళ్ల ఇఫ్తికార్ అహ్మద్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ స్పిన్నర్ కూడా! పాక్ తరఫున ఇప్పటికి 4 టెస్టులు, 28 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇఫ్తికార్.. ఆయా ఫార్మాట్లలో 61, 614, 998 పరుగులు చేశాడు.
పీఎస్‌ఎల్‌లో పర్లేదు
అదే విధంగా టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో 16, టీ20లలో ఎనిమిది వికెట్లు కూల్చాడు. ఇక 2024లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇఫ్తికార్ అహ్మద్.. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఓ మోస్తరుగా రాణించాడు. పది మ్యాచ్‌లలో కలిపి 72 పరుగులు చేయడం(నాలుగుసార్లు నాటౌట్)తో పాటు.. 12 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు నేషనల్ టీ20 కప్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు.
మొన్న అలా. . ఇపుడిలా
ఇదిలా ఉంటే.. ఆగష్టు 2న లంక ప్రీమియర్ లీగ్‌లో భాగమైన దంబుల్లా సిక్సర్స్‌తో ఇఫ్తికార్ అహ్మద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఆ రోజే జాఫ్నా కింగ్స్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో దంబుల్లా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి పరాభవంతో ఇంటిబాటపట్టింది.
ఈ నేపథ్యంలో ఇఫ్తికార్ అహ్మద్ ఊహించని రీతిలో ఆగష్టు 5న క్యాండీ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టు లీగ్ దశలో ఎనిమిదింట మూడు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. ఈ క్రమంలో ఇఫ్తికార్ ప్లే ఆఫ్స్ దశలో క్యాండీ రాయల్స్‌కు ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంటే నాలుగు రోజుల వ్యవధిలోనే దంబుల్లాను వీడి అతడు క్యాండీ రాయల్స్‌తో జట్టుకట్టాడు.
అంతంతమాత్రంగానే
ఈ విషయాన్ని క్యాండీ రాయల్స్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇఫ్తికార్ అహ్మద్‌కు స్వాగతం చెబుతూ అతడు ప్లే ఆఫ్స్‌లో కీలక పాత్ర పోషించబోతున్నాడనే సంకేతాలు ఇచ్చింది. కాగా 2023లో ఇఫ్తికార్ లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. అప్పుడు అతడు కొలంబో క్యాప్స్‌కి ప్రాతినిథ్యం వహించి.. రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీయడంతో పాటు నాలుగు ఇన్నింగ్స్ ఆడి 25 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే.. బుధవారం క్వాలిఫయర్-1లో జాఫ్నా కింగ్స్- గాలే గాలంట్స్ తలపడుతుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో క్యాండీ రాయల్స్ కొలంబో క్యాప్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక శుక్రవారం క్వాలిఫయర్-2, శనివారం లంక ప్రీమియర్ లీగ్ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.


