2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐసీసీ టోర్నీ తేదీలను ఖరారు చేసినప్పటికీ, వేదికను ఇంకా నిర్ణయించలేదు. మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫయర్‌లో పోటీ పడనున్నాయి.
ఈసారి క్వాలిఫికేషన్ విధానంలో కీలక మార్పులు ఉన్నాయి. 10 జట్లు క్వాలిఫయర్‌లో పాల్గొంటాయి. ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన జట్టు నేరుగా 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. 2, 3, 4 స్థానాల్లో నిలిచే జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ సిరీస్ దశకు వెళ్తాయి. సూపర్ సిరీస్‌లో విజేతకు ప్రపంచకప్ ప్రధాన దశలో మిగిలిన ఒక బెర్త్ దక్కుతుంది.
ఏ జట్లు క్వాలిఫయర్‌కు వస్తాయి..?
10 జట్లలో 2 జట్లు 2026 సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో దిగువన ఉండే ఫుల్ మెంబర్ జట్లు. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఇందుకు మినహాయింపు. 4 జట్లు క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2లో టాప్-4 జట్లు. మిగతా 4 జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ప్లేఆఫ్‌లో టాప్-4 జట్లు.
విండీస్ పరిస్థితి ఆసక్తికరం
ప్రస్తుతం వెస్టిండీస్ పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ఆ జట్టు సెప్టెంబర్ 30 కట్‌ఆఫ్‌కు ముందు భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ సిరీస్ ఫలితాలు వారి ప్రపంచకప్ మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. 2027 ODI ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది.


