వరల్డ్ నంబర్‌వన్ షి యుకీతో పోరుపై షట్లర్ ఆయుశ్ శెట్టి
న్యూఢిల్లీ: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుశ్ శెట్టికి తొలి రౌండ్‌లోనే పెద్ద సవాల్ ఎదురైంది. స్వదేశంలో జరగనున్న ఈ మెగా టోర్నీలో ఆయుశ్ వరల్డ్ నంబర్‌వన్ షి యుకీతో తలపడనున్నాడు. యుకీతో గతంలో మూడుసార్లు ఆడిన ఆయుశ్ ప్రతీసారి ఓటమి పాలయ్యాడు. అయితే ఇప్పుడు మరింత సన్నద్ధతతో ఈ పోరుకు వచ్చానని, తన ఆటతీరును మార్చుకున్నానని అతను వ్యాఖ్యానించాడు. ‘టోర్నీ డ్రా విడుదలైనప్పుడు షి యుకీతో నా మ్యాచ్ అని తెలియగానే సిద్ధమైపోయాను. చాలా కఠినమైన పోరు అని నాకు తెలుసు.
గతంలో అతని చేతిలో ఎదురైన ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి ట్రెయినింగ్‌లో మరింతగా కష్టపడ్డా. మానసికంగా కూడా ఎంతో దృఢంగా తయారయ్యా. సీనియర్ సర్క్యూట్‌లో టాప్–20 ప్లేయర్లతో ఆడటం ఎప్పుడైనా సవాలే. పూర్తి నియంత్రణతో జాగ్రత్తగా ఆడుతూ పాయింట్లు రాబట్టడమే ఇప్పటి వరకు నా శైలి. కానీ ఇప్పుడు మరింత దూకుడుగా ఆడటం నేర్చుకున్నా. షి యుకీపై కూడా దూకుడుతోనే ఫలితం రాబట్టగలనని భావిస్తున్నా. స్టార్ ప్లేయర్ పీవీ సింధుతో కలిసి ప్రాక్టీస్ చేయడం నాకు చాలా కలిసొచ్చింది. ఆమె ఆటలోని ధాటిని నేనూ నేర్చుకున్నా. ఆసియా చాంపియన్‌షి ప్, థామస్ కప్‌లో రాణించిన అనుభవం నాకు మేలు చేస్తుంది’ అని ఆయుశ్ వెల్లడించాడు.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉన్న ఆయుశ్ ఈ ఏడాది 14 టోర్నీల్లో పాల్గొన్నాడు. 14 మ్యాచ్‌ల్లో గెలిచి, 14 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆసియా చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో షి యుకీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఆయుశ్... థామస్‌కప్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు టోర్నీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన అతను, ఏడు టోర్నీల్లో తొలి రౌండ్‌లో వెనుదిరిగాడు. 2009 తర్వాత మరోసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి ప్ ఈనెల 17 నుంచి 23 న్యూఢిల్లీలో జరుగుతుంది.


