విభిన్న మస్కట్‌లకు ఆహ్వానం | Invitation to different mascots | Sakshi
Sakshi News home page

విభిన్న మస్కట్‌లకు ఆహ్వానం

Apr 19 2026 4:57 AM | Updated on Apr 19 2026 4:58 AM

Invitation to different mascots

ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం ‘బాయ్‌’ ప్రత్యేక పోటీ

విజేతకు రూ. 25 వేలు నగదు బహుమతి

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కోసం ప్రత్యేక మస్కట్‌ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్‌’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్‌షిప్‌ జరగనుంది. 

గత దశాబ్దంలో ఈ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్‌–చిరాగ్‌ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్‌ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్‌  రూపకల్పన ఉండాలని ‘బాయ్‌’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్‌’ అధికారిక వెబ్‌సైట్‌ https://www. badmintonindia.org/  ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. 

విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్‌ మ్యాచ్‌ వీఐపీ పాస్‌లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్‌ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్‌ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్‌’ కార్యదర్శి సంజయ్‌ మిశ్రా అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement