ఆయుశ్‌ సంచలనం | Ayush Shetty is sure of a medal at the Asian Badminton Championship | Sakshi
Sakshi News home page

ఆయుశ్‌ సంచలనం

Apr 11 2026 2:45 AM | Updated on Apr 11 2026 2:45 AM

Ayush Shetty is sure of a medal at the Asian Badminton Championship

ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీపై విజయం

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో పోటీపడుతున్న ఈ కర్ణాటక షట్లర్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2024 ఆసియా చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్‌ ఆయుశ్‌ 23–21, 21–17తో సంచలన విజయం సాధించాడు. 

54 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఆయుశ్‌ నిలకడగా ఆడుతూ క్రిస్టీని కట్టిపడేశాడు. తొలి గేమ్‌లో 18–20తో వెనుకబడ్డ ఆయుశ్‌ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 21–20తో ముందంజ వేశాడు. ఆ తర్వాత క్రిస్టీ 21–21తో స్కోరును సమం చేయగా... ఆయుశ్‌ ఈసారి వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకున్నాడు. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆయుశ్‌ రెండో గేమ్‌లో మరింత జోరు పెంచాడు. 

తొలుత 5–2తో, ఆ తర్వాత 8–6తో, 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్రిస్టీ కోలుకునే ప్రయత్నం చేసినా ఆయుశ్‌ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, 2023 విశ్వవిజేత కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)తో ఆయుశ్‌ తలపడతాడు.  

7 ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో పతకం గెలిచిన ఏడో భారతీయ ప్లేయర్‌ ఆయుశ్‌ శెట్టి. గతంలో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (2018లో కాంస్యం), అనూప్‌ శ్రీధర్‌ (2007లో కాంస్యం), పుల్లెల గోపీచంద్‌ (2000లో కాంస్యం), ప్రకాశ్‌ పదుకొనే (1976లో కాంస్యం), దినేశ్‌ ఖన్నా (1965లో స్వర్ణం, 1969లో కాంస్యం), సురేశ్‌ గోయల్‌ (1965లో కాంస్యం) ఈ ఘనత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement