జనవరి 2026 నుంచి వేతన బకాయిలు ఇస్తారా? | 8th Pay Commission Arrears Will Govt Employees Get Salary Hike Benefits | Sakshi
Sakshi News home page

జనవరి 2026 నుంచి వేతన బకాయిలు ఇస్తారా?

Nov 16 2026 9:11 AM | Updated on Nov 16 2026 9:28 AM

8th Pay Commission Arrears Will Govt Employees Get Salary Hike Benefits

కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం అమలు, వేతన బకాయిల చెల్లింపుపై చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సవరణ వర్తిస్తుందా? ఒకవేళ అమలు ఆలస్యమైతే ఆ తేదీ నుంచి బకాయిలు చెల్లిస్తారా? అనే సందేహాలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వెలువడిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్లు, పార్లమెంటు సమాధానాలను పరిశీలిస్తే.. జనవరి 1, 2026 నుంచి బకాయిలు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా హామీ ఇవ్వలేదు.

2025 నవంబర్ 3న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 8వ వేతన సంఘం అధికారికంగా ఏర్పాటైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఛైర్‌పర్సన్‌గా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. కమిషన్ విధివిధానాల ప్రకారం.. దీన్ని ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లోగా..అంటే 2027 మే నాటికి కేంద్రానికి తుది సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. అవసరమైతే మధ్యంతర నివేదికలు ఇచ్చే వెసులుబాటు కూడా కమిషన్‌కు ఉంది. ప్రస్తుతం కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉద్యోగ సంఘాలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది.

పార్లమెంటులో కేంద్రం ఏం చెప్పిందంటే..

వేతన సంఘం అమలు తేదీపై 2025 డిసెంబర్ 8న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం అత్యంత కీలకమైనది. సిఫార్సులు అందిన తర్వాత 8వ వేతన సంఘం అమలు తేదీని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆమోదించిన సిఫార్సుల అమలుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామని పేర్కొన్నారు తప్ప జనవరి 1, 2026 నుంచి రెట్రోస్పెక్టివ్‌గా వేతనాలు లేదా బకాయిలు ఇస్తామని ఎటువంటి ప్రకటన చేయలేదు.

1.19 కోట్ల మందిపై ప్రభావం

అధికారిక గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 50.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు ఈ కమిషన్ పరిధిలోకి వస్తారు. వీరి వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ ప్రయోజనాలను సవరించేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్య క్రమశిక్షణ, అభివృద్ధి పథకాలకు నిధుల లభ్యత, పెన్షన్ భారం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం కమిషన్‌కు స్పష్టంగా నిర్దేశించింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతన పెంపు, బకాయిల లెక్కింపు తేదీ, చెల్లింపు విధానంపై కేంద్ర ప్రభుత్వ తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఊహాగానాలను నమ్మకుండా ఆర్థిక శాఖ, 8వ వేతన సంఘం అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి.

ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement