విజయ్‌ సర్కార్‌ యూటర్న్‌.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి | Vijay Govt U Turn: Controversial Order on Student Protests Withdrawn | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌ యూటర్న్‌.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి

Aug 19 2026 1:34 PM | Updated on Aug 19 2026 1:39 PM

Vijay Govt U Turn: Controversial Order on Student Protests Withdrawn

తమిళనాడులో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్‌ పార్టీలతో పాటు కాక్రోచ్‌ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది.  

ఆగస్టు 14న విజయ్‌ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్‌ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలు
ఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్‌జెడ్‌, జెన్‌ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్‌.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్‌జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీపీజే తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహం
ఈ ఉత్తర్వులపై సీపీజే తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌.. విజయ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీపీజే, లెఫ్ట్‌ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్‌ పి. సెల్వం అభివర్ణించారు.

విజయ్‌ ప్రభుత్వానికి లెఫ్ట్‌ మద్దతు..
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు జూన్‌లో లెఫ్ట్‌ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్‌, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.

ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్‌ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది.  ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది.

విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.

ఇటు సీపీజే పేరుపైనా వివాదం
ఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్‌ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్‌లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్‌ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement