నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించేందుకు చెన్నై ట్రాఫిక్ పోలీసులు అత్యంత కఠిన చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు షాక్ ఇస్తూ, స్పాట్ ఫైన్ (అక్కడికక్కడే జరిమానా) విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చారు. చెన్నై పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ చాముండేశ్వరి ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇందు లో భాగంగా రాబోయే 10 రోజుల పాటు నగరంలోని ప్రధాన రహదారులు, రద్దీగా ఉండే జంక్షన్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్ స్పాట్స్) ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.
ఉల్లంఘనలపైన కొరడా : ఎలాంటి నెంబర్ ప్లేట్ లేకుండా, లేదా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ, అస్పష్టమైన నెంబర్ ప్లేట్లు అమర్చి తిరిగే వాహనాలు, టూ–వీలర్లపై ముగ్గురు ప్రయాణించడం, కారు నడిపేటప్పుడు , పక్కన కూర్చునేవారు సీట్ బెల్ట్ ధరించకపోవడం, నిరుత్సాహకరంగా, వేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎలాంటి మినహాయింపు లేకుండా అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనున్నారు. వాహనదారులు అందరూ రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించి, పోలీసుల తనిఖీలకు సహకరించాలని అధికారులు కోరారు. కాగా, ఇది వరకు పోలీసులు స్పాట్ ఫైన్లను కొంత కాలం పక్కన పెట్టి ఈ చలాన్ల రూపంలో జరిమానా విధిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ చలాన్లను చెల్లించకుండా వాహనదారులు తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ చలాన్ల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకు పోతున్నాయి. ఈ దృష్ట్యా, మళ్లీ స్పాట్ ఫైన్ చలాన్ విధానం అమలులోకి తెచ్చారు.
సాక్షి, చెన్నై:


