దృశ్యం సినిమా చూసి, తండ్రిని హత్య చేసి.. 2,000 కి.మీ వెళ్లి.. | Bihar man watched Drishyam travelled 2000 km done this | Sakshi
Sakshi News home page

దృశ్యం సినిమా చూసి, తండ్రిని హత్య చేసి.. 2,000 కి.మీ వెళ్లి..

Oct 4 2026 4:20 PM | Updated on Oct 4 2026 4:53 PM

Bihar man watched Drishyam travelled 2000 km done this

పట్నా: క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితో తండ్రిని హత్య చేసిన బిహార్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు చివరకు పోలీసులకు చిక్కాడు. సూరత్‌ నుంచి దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించి సమస్తిపూర్‌లోని తన స్వగ్రామానికి చేరుకున్న శివ్‌ శంకర్‌.. నిద్రిస్తున్న తండ్రి రఘువీర్‌ సహనీ(50)పై గొడ్డలితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భార్యకు చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌ అతడి ప్రణాళికను బయటపెట్టింది.

సమస్తిపూర్‌ జిల్లాలోని దర్వా గ్రామంలో జులై 26 రాత్రి ఈ హత్య జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న రఘువీర్‌పై శివ్‌ శంకర్‌ గొడ్డలితో పలుమార్లు దాడి చేసి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. తండ్రితో శివ్‌ శంకర్‌కు చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని, తండ్రి తనను, తన భార్యను వేధించేవాడని అతడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కుటుంబ భూమి విక్రయంపై కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ 
పని కోసం భార్యతో కలిసి సూరత్‌లో ఉంటున్న శివ్‌ శంకర్‌ అక్కడ ‘దృశ్యం’ సినిమా చూశాడని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. పట్నాకు చేరుకున్న తర్వాత హాజీపూర్‌ వెళ్లి, అక్కడి నుంచి రైలులో పాటోరి స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో కొంతదూరం వెళ్లి దాదాపు 4 కిలోమీటర్లు నడిచి అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్నాడు. ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి వెళ్లి, ఇంట్లో ఉన్న గొడ్డలితో తండ్రిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్య తర్వాత తిరిగి పాటోరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న శివ్‌ శంకర్‌ అక్కడ తన ఫోన్‌ను ఆన్‌ చేసి భార్యకు కాల్‌ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ఇదే పోలీసులకు కీలక ఆధారంగా మారింది. తండ్రి అంత్యక్రియలకు కూడా అతడు హాజరు కాకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. సాంకేతిక నిఘాలో హత్య జరిగిన రోజు అతడి ఫోన్‌ పాటోరి పరిసరాల్లో ఉన్నట్లు, సుమారు 36 గంటల తర్వాత సూరత్‌లో కనిపించినట్లు గుర్తించారు. కాల్‌ రికార్డుల్లో భార్యతో చేసిన సంభాషణను కూడా పోలీసులు గుర్తించారు.

దీంతో శివ్‌ శంకర్‌ను పోలీసులు సూరత్‌లో గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఘటనాస్థలాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించింది. రఘువీర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్‌ దర్యాప్తు ఆధారంగా హంతకుడు బాధితుడికి పరిచయస్తుడై ఉండొచ్చని పోలీసులు భావించారు. విచారణలో ‘దృశ్యం’ సినిమా చూసిన తర్వాతే హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు శివ్‌ శంకర్‌ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని జైలుకు పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement