గో బ్యాక్‌ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు! | School Inspection Turns Ugly: CJP Team Attacked Jaipur Village | Sakshi
Sakshi News home page

గో బ్యాక్‌ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!

Aug 21 2026 12:02 PM | Updated on Aug 21 2026 12:10 PM

School Inspection Turns Ugly: CJP Team Attacked Jaipur Village

కాక్రోచ్‌ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌ జైపూర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు.  వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.

సీజేపీ దేశవ్యాప్తంగా స్కూల్‌ ఠీక్‌ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా.. జైపూర్‌ రాంపురా–కన్వర్‌పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ బృందం వెళ్లింది. గత కొంతకాలంగా ఆ స్కూల్‌లో పశువుల పాక నడుస్తోందన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సీజేపీ కో-కన్వీనర్‌ అశుతోష్‌ రాంకా కూడా పాల్గొనాల్సి ఉంది.

అయితే.. ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై అశుతోష్‌ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని, బీజేపీ పంపించిన వ్యక్తులని ఆరోపించారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "బీజేపీ పంపించిన గూండాలు" అంటూ విమర్శలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సీజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.

అబ్బే జరిగింది అది కాదు: స్థానికులు
అయితే స్థానికుల్లో కొందరు మాత్రం సీజేపీ ఆరోపణలను ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. ‘‘వాళ్లు 250 మంది వచ్చారు. వాళ్లు చెబుతున్న దాంట్లో నిజం కూడా లేదు. ఆ పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరమ్మతుల కోసం రూ. 12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. బీజేపీనో, కాంగ్రెస్సో, మరేయితర రాజకీయ పక్షమో ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు. మా ఊరి అంశాన్ని రాజకీయం చేయొద్దని మేం అనుకుంటున్నాం. వాళ్లు నిరసన పేరిట స్కూల్‌కు నష్టం కలిగిస్తే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాఠశాల రక్షణ కోసం నిలబడ్డాం’’ అని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు.. తాము దాడి చేశామన్న దాంట్లో నిజం లేదని కూడా అంటుఉన్నారు.

స్కూల్‌ తనిఖీలపై సర్కారీ ఆంక్షలు
ఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్‌ బీజేపీ ప్రభుత్వం.. ఓ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని ఆదేశించింది. విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రతిపక్షాల విమర్శలు
ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టీకారామ్‌ జూల్లీ.. ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించకుండా అడ్డుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: మంత్రుల కుక్కలకు మెరుగైన వసతులున్నాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement