‘మెట్రో’లో అర్పణ్.. పాత దుస్తులకు కొత్త రూపం!‌ | Delhi Metro Arpan Kendras Collect 76,700 Kg Of Old Clothes In Just Weeks, Here’s How The Recycling Drive Works | Sakshi
Sakshi News home page

‘మెట్రో’లో అర్పణ్.. పాత దుస్తులకు కొత్త రూపం!‌

Oct 5 2026 10:50 AM | Updated on Oct 5 2026 11:20 AM

Delhi Metros Arpan Kendras Collect 76700 Kg of Used Clothes

న్యూఢిల్లీ: పాత దుస్తులను పారవేయకుండా రీసైక్లింగ్‌, అప్‌సైక్లింగ్‌ చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ మెట్రో ప్రారంభించిన ‘అర్పణ్ కేంద్రాలకు’ విశేష స్పందన లభిస్తోంది. ఆగస్టులో ప్రారంభమైన ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 76,700 కిలోల పాత దుస్తులను సేకరించింది. 7,597 మంది దాతలు ఈ దుస్తులను అందించినట్లు అధికారులు తెలిపారు.

అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌ 17 నాటికి ఢిల్లీలోని 10 అర్పణ్ కేంద్రాల్లో 76,700 కిలోల దుస్తులు సేకరించారు. మొత్తం 7,597 మంది తమ పాత దుస్తులను విరాళంగా ఇచ్చారు. ప్రయాణికులు మెట్రో స్టేషన్లలోనే తమకు అవసరం లేని దుస్తులను అందించవచ్చు. అక్కడి నుంచి వాటిని రీసైక్లింగ్‌, అప్‌సైక్లింగ్‌ కోసం పంపిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ), డీఎంఆర్‌సీ లేడీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ (డీఎల్‌డబ్ల్యూవో), ఢిల్లీ ప్రభుత్వ స్టేట్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్‌ (ఎస్‌యూఎల్‌ఎం), క్లాత్స్ బాక్స్ ఫౌండేషన్‌, రెస్పన్‌ సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జులై 14న ముఖ్యమంత్రి రేఖా గుప్తా సమక్షంలో కుదిరింది.

మొదటి అర్పణ్ కేంద్రాన్ని ఆగస్టు 3న పంజాబీ బాగ్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించారు. అదే సమయంలో ఐదు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఐదు కేంద్రాలను ఆగస్టు 17న ప్రారంభించారు. ప్రస్తుతం షాహదరా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రి, మయూర్ విహార్ ఫేజ్-1, పంజాబీ బాగ్ వెస్ట్, షాలిమార్ బాగ్, మోహన్ ఎస్టేట్, లజపత్ నగర్, మాలవీయ నగర్, హౌజ్ ఖాస్, ద్వారకలో ఇవి పనిచేస్తున్నాయి.

అర్పణ్ కేంద్రాలు కేవలం దుస్తుల సేకరణకే పరిమితం కాలేదు. స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ఇవి ప్రదర్శన, విక్రయ కేంద్రాలుగానూ పనిచేస్తున్నాయి. ఎస్‌యూఎల్‌ఎం నెట్‌వర్క్‌లోని మహిళలు ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వారికి వస్త్రాల అప్‌సైక్లింగ్‌లో శిక్షణ ఇస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా మారేందుకు సహకరిస్తున్నారు.

వస్త్రాల వినియోగ కాలాన్ని పెంచడం, విస్మరించిన దుస్తులు ల్యాండ్‌ఫిల్ల్స్‌కు చేరకుండా చూడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఉపయోగించిన వస్తువులను మరింత  ప్రయోజనం ఉన్న ఉత్పత్తులుగా మార్చడాన్నే అప్‌సైక్లింగ్‌ అంటారు. దాతలు తమ విరాళాలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నమోదు చేసుకునే సదుపాయాన్ని కూడా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. నమోదు పూర్తయిన వెంటనే వారికి డిజిటల్‌ ధ్రువీకరణ అందుతుంది. కరపత్రాలు, డిజిటల్‌ ప్రచారం, వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి: Haryana: భీకర గ్యాంగ్‌వార్.. ఒకరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement