మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ! | After NEET Row CJP Targets Another Ministers Exit | Sakshi
Sakshi News home page

మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ!

Aug 21 2026 7:30 AM | Updated on Aug 21 2026 7:32 AM

After NEET Row CJP Targets Another Ministers Exit

నీట్‌ లీకేజీ వ్యవహారంపై నెలకు పైగా ఆందోళనలు చేసి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ).. ఇప్పుడు మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతోంది. ‘‘మంత్రుల కుక్కలకు కూడా ఇంత కంటే మెరుగైన సౌకర్యాలు ఉంటున్నాయి. మరి ఈ పిల్లలేం పాపం చేశారు?’’ అంటూ సీజేపీ చీఫ్‌ అభిజిత్‌ దీప్కే ఈ ఉద్యమాన్ని నడిపించబోతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. 

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదాజీ భూసే(Dadaji Bhuse) పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిస్థితులకు ఆయనే నైతిక బాధ్యత వహించాలని అంటోంది. మంత్రి గనుక రాజీనామా చేయకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. 

లాతూర్‌ జిల్లా ఔసా తెహశీల్‌ ఉజని గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే గురువారం సందర్శించారు. సీజేపీ చేపట్టిన ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పరిశీలించిన ఆయన.. అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు.

తరగతి గదుల్లో బెంచీలు లేకపోవడం, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, పాఠశాలలకు వెళ్లేందుకు సురక్షితమైన రహదారులు లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. “మంత్రుల కుక్కలకు కూడా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస వసతులు లేవు” అని దీప్కే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని దీప్కే ఆరోపించారు. ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన సమస్య అని, రాజకీయ నాయకులు విద్యార్థుల కోసం ఏమీ చేయకపోతే ప్రజలు వారికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నాయకులు హెలికాప్టర్లలో తిరగడానికే ప్రజలు ఓట్లు వేస్తున్నారా? అని నిలదీశారు.

తమ గ్రామాలకు వచ్చే అన్ని పార్టీల నాయకులను విద్య కోసం పనిచేయాలని ప్రజలు డిమాండ్‌ చేయాలని సూచించారు. పాఠశాలలను బాగు చేసే వరకు ఓట్ల కోసం గ్రామాలకు రావొద్దని నేతలకు చెప్పాలని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో రాజకీయాల కోసం బయటకు వచ్చే ప్రజలు.. తమ పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలల సమస్యలపై కూడా పోరాడాలని కోరారు.

మంత్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తారా?
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని దీప్కే డిమాండ్‌ చేశారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి తెలుస్తాయని అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ పాఠశాలల్లో ప్రాథమిక సమస్యలను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు.

కొన్ని పాఠశాలల్లో రేకుల పైకప్పులు కారుతున్నాయని, విద్యార్థులు సరైన బెంచీలు లేకుండానే చదువుకుంటున్నారని చెప్పారు. పాఠశాలల పరిసరాల్లో చెత్త, పాత సామగ్రి పేరుకుపోవడంతో పాములు సంచరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పాముకాటుతో విద్యార్థులు మృతి చెందిన ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు(ఆ వివరాలు చివర్లో..).

మంత్రి తప్పుకోవాల్సిందే.. లేదంటే ఉద్యమం
పాఠశాలల పరిస్థితి చూస్తుంటే దాదా భూసే విద్యాశాఖ మంత్రిగా కొనసాగకూడదని దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని డిమాండ్‌ చేశారు.

సీజేపీ చేపట్టిన పాఠశాలల తనిఖీలతో కొన్ని చోట్ల అధికారులు పనులు ప్రారంభించారని దీప్కే తెలిపారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు. 2029 ఎన్నికల నాటికి జెన్‌జీ కీలక ఓటు బ్యాంకుగా మారుతుందని, విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలను వారు ప్రశ్నిస్తారని పేర్కొన్నారు.

ఎవరీ దాదాజీ భూసే..
దాదాజీ భూసే మహారాష్ట్రకు చెందిన శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) సీనియర్‌ నేత, మాలేగావ్‌ ఔటర్‌ ఎమ్మెల్యే. 2024 డిసెంబర్‌ నుంచి మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనను రాజీనామా చేయాలని సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. 

పాముకాటును నోటిఫయబుల్‌ డిసీజ్‌..
మహారాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటును నోటిఫయబుల్‌ డిసీజ్‌గా ప్రకటించింది. ఇందుకు కారణం.. గడ్చిరోలి జిల్లాలో జరిగిన విషాద ఘటన. ఆగస్టు 9న జప్తలై గ్రామంలోని ప్రభుత్వ సహాయంతో నడిచే గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషపాము కాటుకు ముగ్గురు బాలికలు మృతి చెందగా.. మరో ముగ్గురు విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాత పాముకాటు కేసులను వెంటనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడంతో పాటు యాంటీ-స్నేక్‌ వెనమ్‌ (ASV) లభ్యతను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, వైద్యులు ప్రతి పాముకాటు కేసు, మరణాన్ని తప్పనిసరిగా అధికారులకు నివేదించాలి. దీంతో పాముకాటు ఘటనలపై సమగ్ర సమాచారం సేకరించి, ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడ యాంటీ-వెనమ్‌ కొరత ఉంది వంటి అంశాలను గుర్తించి సత్వర చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement