తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపింది. ఆంధప్రదేశ్ తిరుపతికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. రెండ్రోజులుగా బయట కనిపించని ఆమె.. హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఆమె మరణానికి కారుకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. కాంచీపురం ఎనతూర్‌లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో తిరుపతికి చెందిన నిఖిత ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. గత కొన్నిరోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు. రెండు రోజులుగా తరగతులకు హాజరు కాలేదు. హాస్టల్ గదిలోనే ఉంటోంది.
గురువారం రాత్రి ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వార్డెన్, ఇతర సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. నిఖిత విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పొన్నేరికరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థుల ఆందోళన
విద్యార్థిని మృతితో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా నిఖిత తరగతులకు రాలేదని.. ఇటు హాస్టల్ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
“నిఖిత మృతికి కారకులను శిక్షించాలి” అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యంతోనూ ప్రాథమిక చర్చలు జరిపారు. పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వ్యక్తిగత కారణాలతోనే?
ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సంబంధిత కారణాలతోనే నిఖిత తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిఖిత మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com


