నవ్వుకుంటున్న విశ్లేషకులు, బీసీ సంఘ నేతలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 50 శాతంపైగా సీట్లు బీసీలకే
మహిళలకు అగ్రతాంబూలం గుర్తుచేసుకుంటున్న తిరుపతి వాసులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు దాదాపుగా 50 శాతం సీట్లు కల్పించారు. 50 డివిజన్లలో బీసీలకు అధికారికంగా 17 రిజర్వు అవ్వగా.. వాటితోపాటు అదనంగా జనరల్ రిజర్వు అయిన స్థానాల్లో ఏడు డివిజన్లను బీసీలకే కేటాయించారు. దీంతో బీసీల సంఖ్య 24 చేరింది. కార్పొరేషన్ పరిధిలో 49 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా 24 మంది బీసీలు కార్పొరేటర్లగా విజయం సాధించారు. దాదాపుగా 50 శాతం బీసీలు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. జనరల్ మహిళ స్థానంలోనూ మేయర్‌గా యాదవ వర్గానికి చెందిన డాక్టర్ శిరీషను అందలమెక్కించారు.
తిరుపతి తుడా : బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. మాటల్లోనే కాకుండా నాడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి వెన్నుదన్నుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు దాదాపుగా 50 శాతం అవకాశాలు కల్పించి తమ పార్టీ సిద్ధాంతాన్ని చాటి చెప్పారు. తమ పార్టీకి బలం బీసీలేనంటూ దశాబ్దాల కాలంగా డబ్బా కొట్టుకునే అనేక పార్టీలు రాజకీయం, సామాజికం, ఆర్థిక అంశాల్లో తీరని అన్యాయం చేశాయి. బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయి. అందుకు భిన్నంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపుగా 50 శాతం బీసీలకు అవకాశం కల్పించారు. వారి గెలుపును భూమన అభినయరెడ్డి భుజాన వేసుకుని అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు.
తొలి మేయర్ స్థానం బీసీలకే
కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుపతి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. అయితే భూమన అభినయ్‌రెడ్డి ఆ స్థానంలో బలహీన వర్గాలకు చెందిన విద్యావంతురాలు డాక్టర్ శిరీషను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ ప్రకటన నాడు బీసీ వర్గాల్లో సరికొత్త చైతన్యాన్ని తీసుకొచ్చింది. చరిత్ర పుటల్లో నిలిచేలా తొలి మేయర్‌గా బీసీ వర్గానికి చెందిన డాక్టర్ శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
50 శాతానికి మించి మహిళలకు అవకాశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం అవకాశం ఇవ్వాలని నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు తిరుపతిలో 49 డివిజన్లకు గాను 28 మంది మహిళలకు అవకాశం కల్పించారు. ఇందులో బీసీ మహిళలు ఏడుగురు ఉండడం విశేషం.
33 శాతం ప్రకటించి
సంబరాలా?
మూడు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ప్రకటించారు. మున్సిపల్, నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు జబ్బలు చరిచారు. గతంలో ఎవ్వరూ బీసీలకు అవకాశం ఇవ్వనట్టు, ఇప్పుడే తానుమాత్రమే కొత్తగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను తప్పుదోవ పట్టించేలా, తానే మంచి చేస్తున్నట్లు గొప్పలు చెప్పడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
మాట తప్పని నేత జగనన్న
తిరుపతి తొలి మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వు అవ్వగా బీసీ మహిళ అయిన నాకు జగనన్న అవకాశం ఇచ్చారు. నా తోపాటు 24 మంది కార్పొరేటర్లుగా గెలుపొంది కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేర్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకంటే అవకాశాన్ని బట్టి 50 శాతం సీట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం మేరకు మాకు ఈ అవకాశం వచ్చింది. జగనన్న మాట తప్పని మడం తిప్పని నేత అని నిరూపించుకున్నారు. – డాక్టర్ శిరీష, తిరుపతి నగర మాజీ మేయర్
జగనన్న సూచన మేరకే..
జగనన్న సూచన మేరకే తొలి మేయర్ స్థానాన్ని బీసీలకు అప్పగించాం. అధికారికంగా 17 రిజర్వు కాగా మరో ఏడు జనరల్ స్థానాల్లోనూ బీసీలకు కార్పొరేటర్లుగా అవకాశం కల్పించి గెలిపించుకున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. టీడీపీ బీసీలను ఓటు బ్యాంకు గానే చూసింది.
– భూమన అభినయ్ రెడ్డి,
వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త
సీఎం చంద్రబాబునాయుడు బీసీలను మరోసారి బోల్తా కొట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లంటూ జబ్బలు చరిచారు. ఆయన ప్రకటించారో లేదో.. అదేదో గతంలో ఎవ్వరూ అంత రిజర్వేషన్ బీసీలకు కల్పించనట్టు ఆ పార్టీ నేతలు సంబరాలకు దిగేశారు. పాలాభిషేకాలు.. పూల హారాలతో డప్పు కొట్టుకోవడం ప్రారంభించారు. దీనిపై విశ్లేషకులతోపాటు బీసీ సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 50 శాతానికి పైగా సీట్లు బీసీలకే కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తిరుపతి మేయర్ పదవి సైతం బీసీ మహిళకే కేటాయించారని చర్చించుకోవడం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం సీట్లంటూ సీఎం చంద్రబాబు ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు దిగిన తెలుగు తమ్ముళ్లు


