తిరుపతి మంగళం : రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు తప్పదన్న నిజం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అందరికీ అర్థమవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక.. పంటలు సరిగా పండక రైతుల అవస్థలు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8.76 లక్షలకు పైగా పశువులు, 9.5 లక్షల గొర్రెలు, 4.86 లక్షల మేకలకు ఆహారం, నీళ్లు లేక అలమటిస్తున్నాయన్నారు. ఇప్పటికే వాటికి పోషణ లేక పశువులను కళేబరాలకు తరలిస్తున్న దుస్థితి జిల్లాలో నెలకొందన్నారు. అయినప్పటికీ చంద్రబాబుకు చీమకుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. వ్యవసాయమే దండగ అని, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోండి అన్న రైతు ద్రోహి చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా అంటే పాడి పంటలకు ప్రసిద్ధిగాంచినదిగా పేరుందని, అలాంటి జిల్లాలో కరువు తాండవిస్తున్నా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎంతసేపు హెరిటేజ్ అభివృద్ధి తప్ప జిల్లాలోని పాల ఉత్పత్తుల పరిస్థితిని పట్టించుకుంటున్నావా? చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన పశుసంవర్థకశాఖ డైరెక్టర్ పదవిని తన వర్గానికి చెందిన దామోదర్‌నాయుడికి ఇవ్వడంతో చంద్రబాబుకు ఊడిగాలు చేయడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేసి జిల్లాలోని 66 మండలాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు వైద్య పరీక్షలతో పాటు మంచి మందులను ఉచితంగా ఇవ్వాలన్నారు. పశువులకు నాలుగు మూటల దానాతో పాటు పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా రైతులకు అందించాలన్నారు. లేనిపక్షంలో రైతులకు అండగా ఉండి ఉద్యమ పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు.
డీఎస్సీపై జగనన్న సవాల్‌కు సిద్ధమా?
రాష్ట్రంలో డీఎస్సీలో అర్హత లేనివాళ్లకు ఉద్యోగాలు వచ్చాయని, స్పోర్ట్స్ కోటాలో పేకాట ఆడేవాళ్లను గొప్ప క్రీడాకారులు అని చెప్పుకుని ఉద్యోగాలు ఇచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు, లోకేష్‌లు జగనన్న చేసిన సవాల్‌కు సిద్ధమా? అని భూమన ప్రశ్నించారు. గ్రూప్–1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఎక్కడో కూర్చుని తొడలు కొట్టడం కాదని, తమ నాయకుడు జగనన్న సవాల్‌ను స్వీకరించి గ్రూప్–1 పరీక్షలపై సీబీఐ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే డీఎస్సీపై తండ్రి, కొడుకు సీబీఐ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. డీఎస్సీలో ఉద్యోగాలను లోకేష్ అమ్ముకోవడంతో ఎంతోమంది అర్హులు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.


