ఆర్యభట్ట ఉపగ్రహంతో తొలి అడుగు
ఇప్పటిదాకా 105 ప్రయోగాలు
జాతీయ అంతరిక్ష దినోత్సవానికి
ప్రత్యేక ఏర్పాట్లు
రూ.300 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండో ప్రయోగవేదికను నిర్మించారు. 05–05–2005న ఈ ప్రయోగవేదికను అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ ప్రారంభించారు.
ఘన ఇంధన విభాగాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. శ్రీహరికోటలో ఉన్న ఘన ఇంధనప్లాంటు ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి పది రాకెట్ ప్రయోగాలకు సరిపడే విధంగా ఘన ఇంధన సెగ్మెంట్లు తయారు చేశారు.
రూ.20 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషన్ కంట్రోల్‌రూంను నిర్మించి 2012 జనవరి 02న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దీన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ మిషన్‌కంట్రోల్‌రూంను ఆదిత్య–369 సినిమాల్లో టైంమిషన్ డిజైన్‌లా ఈ భవనాన్ని నిర్మించారు.
రూ.245 కోట్ల వ్యయంతో మల్టీ అబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ కేంద్రాన్ని నిర్మించారు. ఒకే సారి పది రాకెట్‌లను ట్రాకింగ్ చేసే సామర్థ్యం కలిగిన ఎంఓటీఆర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలో ఎంఓటీఆర్ ఉన్న రెండో దేశంగా ఇస్రో ఆవిర్భవించింది.
రూ.628.95 కోట్ల వ్యయంతో ఒకే సారి రెండు రాకెట్లను అనుసంధానం చేసేందుకు రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు.
ఆర్‌ఎల్‌వీ–టీడీ ప్రయోగాత్మక ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి షార్‌లో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా చేసి విజయం సాధించడంతో షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగవేదిక నుంచే రాబోయే పదేళ్లలో స్పేస్‌షటిల్ ప్రోగ్రాంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్ పేరుతో పలు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సాధించింది. ఎంతో మంది మహామహులు చేసిన కృషి ఫలితం వల్లే ఇస్రో గగన్‌యాన్ లాంటి భారీ ప్రయోగాలు చేసే స్థాయికి ఇస్రో ఎదిగింది. నాటి ఆర్యభట్ట నుంచి నేటి గగన్‌యాన్ దాకా తన అంతరిక్ష యాత్ర అప్రతిహతంగా కొనసాగించింది. చంద్రయాన్ లాంటి భారీ ప్రయోగాన్ని నిర్వహించి విజయం సాధించింది. ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని అహమ్మదాబాద్‌లోని స్పేస్ అప్టికేషన్ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి దాకా ఇస్రో సొంతంగా సెంచరీ మైలురాయిని దాటి 105 ప్రయోగాలు చేసింది.
తూర్పు తీర ప్రాంతాన
తుంబా రాకెట్ కేంద్రం పెద్ద ప్రయోగాలకు అనువుగా లేదని భారతదేశానికి మంచి రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తూర్పు తీరాన పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతాన్ని గుర్తించారు. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో పాటు గ్రావిటీ పవర్ తక్కువగా ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉందని శ్రీహరికోటను ఎంపిక చేశారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఇప్పటి దాకా ఆరు రకాల రాకెట్‌ల ద్వారా 135 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్స్ తయారు చేసిన ఉపగ్రహాలు, 434 విదేశీ ఉపగ్రహాలు, 9 రీ ఎంట్రీ మిషన్లు, రెండు ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు చెంది ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే రెండో స్థానంలోకి చేరడం విశేషం.
ఆర్యభట్ట ఉపగ్రహంతోనే అడుగులు
శ్రీహరికోట రాకెట్ కేంద్రం పూర్తి స్థాయిలో రూపాంతరం చెందాక మొదటి ప్రయోగవేదిక నుంచి 1979 ఆగస్టు 10న ఎస్‌ఎల్‌వీ–3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. మొదటి ప్రయోగం విఫలమైంది. 1980 జులై 18న చేసిన ఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం–3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, హెచ్‌ఆర్‌ఎల్‌వీ లాంటి భారీ ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగారు. 2023 జులై 14న ప్రయోగించిన చంద్రయాన్–3 ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం దక్షిణ ధృవంపై ల్యాండర్ దించి రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేశారు. ఆ రోజుని ఒక ప్రత్యేక దినమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ సైన్స్ దినోత్సవం (నేషనల్ స్పేస్ డే)గా ప్రకటించి ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
2023 ఆగస్టు 23న చంద్రుడిపై దిగిన ల్యాండర్
రాకెట్‌తో పోటీపడుతున్న షార్ అభివృద్ధి
అత్యాధునిక సౌకర్యాలు
శ్రీహరికోటలో ఒకే సారి ఐదు రాకెట్‌లను అనుసంధానం చేసుకునే విధంగా నాలుగు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్స్, రెండు ప్రయోగవేదికలు ఉన్నాయి. ఏడాదికి 12 ప్రయోగాలు చేసుకునే అధునాత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. వరల్డ్ క్లాస్ స్పేస్ సెంటర్‌గా సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ అభివృద్ధి పథంలో రాకెట్‌వేగంతో దూసుకుపోతోంది.


