పోలీస్‌ కస్టడీలో శశికళ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కస్టడీలో శశికళ

Aug 22 2026 1:53 AM | Updated on Aug 22 2026 1:53 AM

రేణిగుంట: మండలంలోని అడుసుపాళెం జగనన్న లేఅవుట్‌లో స్థలాలు ఇస్తామని చెప్పి దొంగ పట్టాలు ఇచ్చిన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ శశికళను న్యాయస్థానం రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌లో రూరల్‌ సీఐ మంజునాథరెడ్డి శశికళను విచారిస్తున్నారు. శుక్ర, శనివారాలు విచారణ సాగనుంది.

నిందితుడిపై పీడీ యాక్ట్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కేరళకు చెందిన అజయ్‌కుమార్‌ అలియాస్‌ అజయన్‌ (57)పై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పీడీ యాక్ట్‌ అమలు చేశారు. ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్‌లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళకు అజయ్‌ కుమార్‌ అలియాస్‌ అజయన్‌ క్లాత్‌ మర్చంట్‌గా ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించి పీడీ యాక్ట్‌ అమలుకు టాస్క్‌ ఫోర్స్‌ సిఫారసు చేసింది. నిందితుడిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కుమార్తెను ఎక్కడికి తీసుకెళ్లాడు?

తిరుపతి క్రైం : దంపతుల మధ్య విబేధాల కారణంగా వేర్వేరుగా ఉంటున్న కుటుంబంలో, తల్లికి తెలియకుండా నాలుగేళ్ల కుమార్తెను తండ్రి తీసుకెళ్లిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిరుపతి అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి శెట్టిపల్లికి చెందిన వర్ష, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన వెంకటకృష్ణ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. వీరికి ధన్వితశ్రీ (4) అనే కుమార్తె ఉంది. అయితే, గత మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వర్ష తన కుమార్తె ధన్వితశ్రీని శెట్టిపల్లిలోని తన తల్లి ఇంట్లో ఉంచింది. కాగా, రెండు రోజుల క్రితం వెంకటకృష్ణ శెట్టిపల్లికి వచ్చి, వర్షకు తెలియకుండా చిన్నారిని తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వర్ష వెంటనే తిరుపతి అలిపిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. వర్ష ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తొట్టంబేడు డిప్యూటీ

తహసీల్దార్‌ సస్పెన్షన్‌

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌): తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్‌ జీవన్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. 0.09 సెంట్ల భూమికి సంబంధించి రూ.3 లక్షలు లంచం డిమాండ్‌ చేయడం, శెట్టిపల్లి భూములకు సంబంధించి ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పై నిరాధార ఆరోపణలు చేసిన ఒక ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ విషయంపై శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా సదరు ఆడియో రికార్డింగ్‌ పరిశీలించి అందులోని వాయిస్‌ తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్‌ జీవన్‌కుమార్‌దిగా గుర్తించారు. అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా జీవన్‌ కుమార్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు సోషల్‌ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. ఈ విషయమై తొట్టంబేడు తహసీల్దార్‌ భారతిని వివరణ కోరగా తమకు అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని.. వస్తే తెలియజేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement