తిరుపతి క్రైం: తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. చంద్రగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ద్విచక్ర వాహనాల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ నెల 21న ఉదయం 8 గంటల సమయంలో నారావారిపల్లి–భీమవరం రోడ్డులోని శేషాపురం శివాలయం సమీపంలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులు వీరే
పట్టుబడిన వారిలో పడారుపల్లి, నెల్లూరు జిల్లాకు చెందిన పఠాన్ అఫ్రోజ్ (21), చిత్తూరు జిల్లాకు చెందిన ఎణిమేటి లోచన్ నివాస్ (19), మదారపు వంశీకృష్ణ (19), చంద్రగిరి మండలానికి చెందిన కృష్ణప్ప ఆచారి సాయికృష్ణ (18), నీరుకొండ జితేంద్ర బెనర్జీ (20), నెల్లూరు జిల్లా పడారుపల్లికి చెందిన పందల సతీష్‌బాబు (28)ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం శ్రీనివాసమంగాపురం గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో దాచిపెట్టిన చోరీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో సహకరించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.


