శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 70,114 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,963 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

ఎట్టకేలకు ఐసెట్‌ కౌన్సెలింగ్‌

–24 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

తిరుపతి సిటీ: ఏపీఐసెట్‌–2026 కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించి కమిషనరేట్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఎట్టకేలకు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది. ఈనెల 24 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఈనెల 27 నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు, వచ్చే నెల 3న అప్షన్ల మార్పు, అదే నెల 7వ తేదీన తొలి విడత మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐసెట్‌ పరీక్ష మే 2న నిర్వహించగా.. ఫలితాలు అదే నెల 16న విడుదలయ్యాయి. మూడు నెలలుగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం జిల్లాలోని సుమారు 12 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు.

నేడు తిరుపతి ఐఐటీ

8వ స్నాతకోత్సవం

ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో శనివారం తిరుపతి ఐఐటీ 8వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని, పట్టభద్రులైన విద్యార్థులకు స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత వైమానికదళ టెస్ట్‌ పైలట్‌, వ్యోమగామి కెప్టెన్‌ శుభాంశుశుక్లా, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 457 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. వారిలో ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్‌ మెడల్‌ను బీటెక్‌ (సీఎస్‌ఈ)ని అత్యధిక మార్కులతో పూర్తి చేసిన టంగుటూరి మోక్షిత్‌రెడ్డి అందుకోనున్నారు. అలాగే గవర్నర్‌ మెడల్‌ను బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థి శుభం మొహంతి మరో 19 మంది విద్యార్థులు వివిధ అవార్డులను ఈ స్నాతకోత్సవంలో అందుకోబోతున్నారు.

తిరుపతి వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు

తిరుపతి అర్బన్‌: తిరుపతి వేదికగా ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జేసీ గోవిందరావుతో కలసి అధికారులతో సమీక్షించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అమరావతి చాంపియన్‌షిప్‌–2026 రాష్ట్ర స్థాయి పోటీలకు తిరుపతి సిద్ధంగా ఉందన్నారు. తిరుపతిలోని వివిధ క్రీడా మైదానాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. అండర్‌–17, అండర్‌–21 విభాగాల్లో (బాలురు, బాలికలు) 12 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొంటారని చెప్పారు. మొత్తంగా 956 మందికి రూ.91.9 లక్షల నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ నెల 29న విజయవాడలో ముగింపు వేడుకలు ఉంటాయని, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement