సునామీలా వరద.. ఆ పరమశివుడే కాపాడాడేమో! | Lord Shiva Saved Us: Kailash Pilgrims Recall Nepal Flood Ordeal | Sakshi
Sakshi News home page

సునామీలా వరద.. సాక్షాత్తూ ఆ పరమశివుడే కాపాడాడేమో!

Aug 29 2026 2:02 PM | Updated on Aug 29 2026 2:33 PM

Lord Shiva Saved Us: Kailash Pilgrims Recall Nepal Flood Ordeal

కొండలపై నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద.. క్షణాల్లోనే అంతా తుడిచిపెట్టేసింది. చుట్టూ బురద, రాళ్లు, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువే కనిపించింది. ఇంత విషాదంలో కొందరి ప్రాణాలు మాత్రం అద్భుతంగా దక్కాయి. తాము చూసిన భయానక దృశ్యాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ వారు చెప్పిన మాటలు ఆ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.

కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన తమిళనాడు యాత్రికులకు నేపాల్‌లో ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆగస్టు 26న రసువాగఢి ప్రాంతంలో ఒక్కసారిగా కొండలపై నుంచి నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయి. క్షణాల్లోనే రహదారులు, భవనాలు కొట్టుకుపోవడంతో 21 మంది యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చివరకు సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు.

తమ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదీ తీరంలో భారీగా పొగలాంటిది కనిపించిందని యాత్రికులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  తొలుత ఏదైనా పేలుడు జరిగిందని భావించామని.. అంతలోనే కొండపై నుంచి నీరు, మట్టి, ఇసుక, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం దూసుకొచ్చిందని చెప్పారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ తమ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

వరద ప్రవాహం బస్సులకు చేరువవుతుండటంతో డ్రైవర్‌ వైపు నుంచి బయటకు వచ్చి సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొందరు మహిళలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడటంతో.. చీర సాయంతో ఒకరినొకరు పైకి లాగుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు నానా అవస్థలు పడి చివరకు ఓ రెస్క్యూ కేంద్రానికి చేరుకున్నారు.

ఆ పరమశివుడి ప్రతిరూపం..
తమను స్వయంగా ఆ శివుడే కాపాడాడని కొందరు యాత్రికులు నమ్ముతున్నారు. వరద ప్రవాహం తమవైపు దూసుకొస్తున్న సమయంలో సమీపంలోని కొండపై మట్టి, బురదతో శివుడి ముఖం ఆకారంలో ఓ రూపం కనిపించిందని వారు భావోద్వేగంగా చెబుతున్నారు. కైలాసానికి వెళ్లి శివుడి ఆశీస్సులు పొందాలనుకున్న తమను.. ఈ విపత్తు నుంచి కూడా ఆయనే కాపాడాడని చెప్పారు. 

నేపాల్‌ సైన్యానికి కృతజ్ఞతలు
విపత్తులో చిక్కుకున్న యాత్రికులను నేపాల్‌ సైన్యం, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారిని ఖాట్మాండుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి న్యూఢిల్లీ మీదుగా చెన్నైకి తరలించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ యాత్రికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఇంకా వందలాది మంది ఆచూకీ లేదు
ఇదిలా ఉండగా.. నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాలను కుదిపేసిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్‌ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 700కు దగ్గర్లో చేరగా.. 2,426 మంది గల్లంతైనట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్‌కు ఆహారం, మందులు, దుప్పట్లు, సోలార్‌ ల్యాంపులు తదితర సహాయక సామగ్రిని కూడా భారత్‌ పంపుతోంది.

ఇదీ చదవండి: యుగాంతం వచ్చేసిందా? అన్నట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement