టెండర్ల వేళ పాత బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్ల డిమాండ్
లెక్కలు తేలిన తర్వాతే చెల్లిస్తామంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీకి ముందుకు వెళ్తున్న సమయంలో పాత బకాయిల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం నిధులు కేటాయించినా..మీనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో మాత్రం బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం సుమారు రూ.120 కోట్ల మేర నిధులు కేటాయించగా అందులో సగం మేరకే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు సంబంధిత శాఖ వద్ద ఉన్నప్పటికీ తమకు రావాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది టెండర్లు ఆసల్యంగా వేయడం, ధర పెంపు కోసం కాంట్రాక్టర్లు పట్టుపట్టడతో చేపల పంపిణీ కూడా డిసెంబర్ వరకు సాగింది. దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీ మధ్యలోనే ఆపేసి మమ అనిపించారు. ఈ ఏడాది రూ.116 కోట్లతో చేప, రొయ్య పిల్లల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పాత బకాయిల అంశం కొత్త టెండర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందా? అనే చర్చ మొదలైంది. గత ఏడాది కేటాయించిన నిధుల్లో గణనీయమైన మొత్తం ఖర్చు కాకుండా మిగిలి ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిధులు శాఖ వద్ద అందుబాటులో ఉన్నప్పుడు.. సరఫరా పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని వారు నిలదీస్తున్నారు. మరో వైపు బిల్లుల చెల్లింపులో జాప్యం కొనసాగితే భవిష్యత్తులో చేప పిల్లల సరఫరా ప్రక్రియపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే బిల్లుల చెల్లింపునకు ముందు గతంలో చేప పిల్లల పంపిణీపై పూర్తి స్థాయి లెక్కలు తేల్చాలని మత్స్యశాఖ భావిస్తోంది.
గతంలో కాంట్రాక్టర్లు సరఫరా చేసిన చేప పిల్లలు ఎన్ని? ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాస్తవంగా చెరువుల్లో ఎన్ని చేప పిల్లలను విడుదల చేశారు? వాటిలో ఎన్ని పిల్లలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి? అనే అంశాలపై శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చేప పిల్లల నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సరఫరా చేసిన పరిమాణం, చెరువుల్లో విడుదల చేసిన సంఖ్య, సంబంధిత రికార్డులు, అధికారుల ధ్రువీకరణ తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


