కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల ఎంపిక, అర్హతలు, నైతిక ప్రవర్తన ఆధారంగా జరుగుతుంటుంది. కానీ, ఒక ఉద్యోగి చేసిన పొరపాటుకు ఏకంగా నాలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులపై నిషేధం విధిస్తూ బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈఓ తీసుకున్న నిర్ణయం ఐటీ, స్టార్టప్ వర్గాల్లో దుమారం రేపుతోంది.
‘ఏ1 స్పోర్ట్స్ వరల్డ్’ ఫౌండర్, సీఈఓ కార్తిక్ ఎస్‌జీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను తమ కంపెనీలోకి ఇకపై తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరాదికి చెందిన ఒక మాజీ ఉద్యోగి అక్కడి మహిళా సిబ్బంది పట్ల వేధింపులకు పాల్పడటం, హెచ్చరించినా వైఖరి మార్చుకోకపోవడంతో అతడిని తొలగించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ సంస్థలోని 14 మంది మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు.
ప్రాంతీయ వివక్షా?
ఈ నిర్ణయం నెట్టింట చర్చకు దారితీసింది. ఒకరి వ్యక్తిగత ప్రవర్తనకు ఒక ప్రాంతం లేదా రాష్ట్రం మొత్తాన్ని బాధ్యులను చేస్తూ నిషేధించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు, సమానత్వ హక్కులకు విరుద్ధమని నిపుణులు, నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. అర్హతలను పక్కనపెట్టి ప్రాంతీయ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కార్పొరేట్ సంస్కృతికే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
అయితే, ‘నా కంపెనీ– నా నిబంధనలు’ అని సమర్థించుకున్న సీఈఓ, తమ కంపెనీలో మొత్తం 32 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో ఇతర రాష్ట్రాల వారు, ముఖ్యంగా దక్షిణేతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా సురక్షితంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Im sorry for this...
But today we have made it very clear after lengthy discussion and quarrel...
We will not hire any male candidates in our company who come from these 4 states in north india...
1. Uttar Pradesh.
2. Rajasthan.
3. Bihar.
4. Madhya Pradesh.
We do have 1…— Karthik SG (@kkarthikkgs) September 22, 2026
లీగల్, హెచ్‌ఆర్ వర్గాల ఆందోళన
ఈ పరిణామంపై కార్పొరేట్ న్యాయ నిపుణులు, హెచ్‌ఆర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో మహిళల భద్రత కోసం గైడ్‌లైన్స్, చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు అభ్యర్థుల ప్రాంతీయ గుర్తింపును బట్టి నిషేధం విధించడం చట్టబద్ధంగా నిలవదని పేర్కొంటున్నారు. కార్పొరేట్ నిర్ణయాలు చట్టపరిమితులకు లోబడి ఉండాలే తప్ప వ్యక్తిగత ఆగ్రహంతో తీసుకునేవిగా ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..


