వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చవద్దని హితవు
విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అఫిడవిట్లు, కోర్టు పత్రాలను సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించడం పట్ల బాంబే హైకోర్టు విజయ్ మాల్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం న్యాయస్థానాల సమర్థతను, స్వతంత్రతను దిగజార్చేలా ఉందనడంలో సందేహం లేదని ధర్మాసనం హెచ్చరించింది.
జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు మాల్యా తరఫు సీనియర్ అడ్వకేట్ అమిత్ దేశాయ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) దాఖలు చేసిన అఫిడవిట్ సెప్టెంబర్ 9న విచారణకు రావాల్సి ఉండగా అధికారికంగా కోర్టుకు సమర్పించడానికి ముందే (సెప్టెంబర్ 8 నాటి రాత్రి) మాల్యా దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసినట్లు ఈడీ న్యాయవాది ఆశిష్ మెహతా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ‘ఇది ఏమాత్రం సరైన ప్రవర్తన కాదు. విషయం చాలా తీవ్రమైనది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్లయింట్‌ను హెచ్చరించండి. ఏవైనా వాదనలు లేదా నివేదికలు ఉంటే నేరుగా కోర్టుకే సమర్పించాలి తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని స్పష్టం చేశారు.
కేసు నేపథ్యం
భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను ఎగవేసి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్)కు పాల్పడ్డారనే ఆరోపణలను మాల్యా ఎదుర్కొంటున్నారు. రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల సమాఖ్యకు కన్సార్టియం ద్వారా అప్పగించినందున తనపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ మాల్యా 2020లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బ్యాంకుల రికవరీ చర్యల వల్ల క్రిమినల్ తీవ్రత తగ్గిపోదని, మనీ లాండరింగ్ నేరం చెల్లదని ఈడీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. తదుపరి విచారణలో ఎస్‌బీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..


