ఆవిడ లిఫ్ట్‌లో చిక్కుకోగానే.. అసలు కథ మొదలైంది! | IAS Officer Wife Gets Trapped in Hotel Lift Then Happend This Viral | Sakshi
Sakshi News home page

ఆవిడ లిఫ్ట్‌లో చిక్కుకోగానే.. అసలు కథ మొదలైంది!

Sep 22 2026 12:52 PM | Updated on Sep 22 2026 1:01 PM

IAS Officer Wife Gets Trapped in Hotel Lift Then Happend This Viral

ఐదు నక్షత్రాల హోటల్‌.. ఖరీదైన సదుపాయాలు.. అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ఉంటాయేమోనని ఎవరైనా అనుకుంటారు. అలా అనుకునే ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి భార్య కూడా వెళ్లింది. సరిగ్గా అప్పుడే ఆమె ఎక్కన లిఫ్ట్‌ పని చేయకుండా పోయింది. అలా అరగంట గడిచాక.. ఆమెను బయటకు తీస్తే.. బతుకు జీవుడా అనుకుంటూ ఏడుస్తూ వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..

ఓ వైద్య సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి భార్యతో పాటు మరో వైద్యుడు, వైద్య సిబ్బంది లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. లిఫ్ట్‌లో ఉన్న సంప్రదింపు నంబర్‌కు పలుమార్లు ఫోన్‌ చేసినా వెంటనే స్పందన రాలేదు. చివరకు విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నగరపాలక సంస్థ ఫైర్‌ బ్రిగేడ్‌, విద్యుత్‌, ఆరోగ్య విభాగాల సిబ్బంది అక్కడికి చేరుకుని ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల తర్వాత వాళ్లు బయటకు వచ్చారు.

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని అరీరా హిల్స్‌ ప్రాంతంలోని కోర్ట్‌యార్డ్‌ బై మారియట్‌ హోటల్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసిన తర్వాత అధికారులు అక్కడితో ఆగలేదు. ఘటనకు అసలు కారణమేంటి? లిఫ్ట్‌ నిర్వహణ ఎలా ఉంది? అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను రక్షించే పరికరాలు ఉన్నాయా? అనే కోణాల్లో హోటల్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో కీలకమైన ఆటోమేటిక్‌ రెస్క్యూ డివైస్‌ (ARD) లిఫ్ట్‌లో లేదని గుర్తించారు. 

అంతేకాదు.. లిఫ్ట్‌లకు చేయాల్సిన నెలవారీ నిర్వహణ కూడా సకాలంలో జరగలేదని తేలింది. ఆగస్టు 31న చేయాల్సిన మెయింటెనెన్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లిఫ్ట్‌ తనిఖీతో ఆగకుండా హోటల్‌లోని అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు పరిశీలించారు. ఫైర్‌ సేఫ్టీ పరికరాలు, అత్యవసర తరలింపు మార్గాలు, ఎగ్జిట్‌ గేట్లను తనిఖీ చేశారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని ఏర్పాట్లు లేవని నగరపాలక సంస్థ తెలిపింది.

ఇక ఆరోగ్య విభాగం హోటల్‌ ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌తో పాటు సంబంధిత పత్రాలను కూడా పరిశీలించింది. అంటే ఒక లిఫ్ట్‌ ఆగిపోవడంతో మొదలైన తనిఖీలు.. హోటల్‌ మొత్తంలోని భద్రతా వ్యవస్థలపైకి వెళ్లాయన్నమాట.  

వరుస లోపాలు బయటపడటంతో హోటల్‌లోని మూడు లిఫ్ట్‌లను భోపాల్‌ నగరపాలక సంస్థ తాత్కాలికంగా సీజ్‌ చేసింది. ఈ హోటల్‌ను గతంలోనూ తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలు పాటించాలని నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ లిఫ్ట్‌ నిర్వహణ, ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన లోపాలు మళ్లీ కనిపించడంతో తాజా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇక్కడితోనే ఆగిపోయిందని అనుకుంటున్నారా?.

ఇప్పుడు నగరమంతా తనిఖీలు
ఈ ఘటనతో భోపాల్‌ నగరపాలక సంస్థ మరింత విస్తృత తనిఖీలకు సిద్ధమైంది. నగరంలోని హోటళ్లు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో ఉన్న లిఫ్ట్‌లను తనిఖీ చేయాలని నిర్ణయించింది. లిఫ్ట్‌లకు సకాలంలో మెయింటెనెన్స్‌ జరుగుతోందా? ఏడీఆర్‌ వంటి భద్రతా పరికరాలు ఉన్నాయా? అవసరమైన ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనుందట. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ సంస్కృతి జైన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

హోటళ్లు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల నిర్వాహకులు లిఫ్ట్‌ల నిర్వహణతో పాటు అన్ని భద్రతా ఏర్పాట్లను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఆ లిఫ్ట్‌లో ఐఏఎస్‌ అధికారి భార్య సహా ముగ్గురు చిక్కుకోకపోయి ఉంటే.. ఈ లోపాలన్నీ ఇంత త్వరగా వెలుగులోకి వచ్చేవా అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: ఎస్సై మర్డర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement