పెట్టుబడుల విషయంలో ఇప్పటికీ చాలామంది యువతలో ఎన్నెన్నో ఆలోచనలు, లెక్కలేనన్ని సందేహాలు ఉన్నాయి. అయితే.. 10వ తరగతి అమ్మాయి ఏకంగా రూ.13.9 లక్షల విలువైన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది.
బెంగళూరులోని స్వర్గరాణి స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న.. 15 ఏళ్ల సించన సంతోష్ (Sinchana Santosh) చిన్న వయసులోనే డబ్బు విలువను తెలుసుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచే డబ్బు దాచుకోవడం అంటే చాలా ఇష్టం. పిగ్గీ బ్యాంక్‌లో డబ్బు దాచుకుంటూ 12 ఏళ్ల వయసులోనే దాదాపు రూ.10,000 పొదుపు చేసింది.
డబ్బు విలువ ఆలా అర్థమైంది
చిన్నప్పుడు టెలిస్కోప్ కొనాలని తన తండ్రిని అడిగినప్పుడు.. నేను మొత్తం డబ్బును ఇవ్వను, కొంత డబ్బును నువ్వే సంపాదించుకోవాలని సూచించారు. ఆ సమయంలో ఆమె తన బంధువుల ద్వారా రూ. 10,000 సమకూర్చుకుంది. మిగిలిన రూ.2,000ను ఆమె తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ సంఘటనతో ఆమెకు డబ్బు విలువ మరింత బాగా అర్థమైంది.
తర్వాత ఆమె తల్లిదండ్రుల నుంచి పెట్టుబడుల గురించి నేర్చుకుంది. అలాగే యూట్యూబ్లో ఆర్థిక విషయాలకు సంబంధించిన వీడియోలు చూసి మరింత సమాచారం తెలుసుకుంది. అంకుర్ వారికూ, డేవ్ రామ్సే, పవర్ ఆఫ్ మనీ, మింట్ వెల్త్, సోనియా షెనాయ్ వంటి వారి వీడియోలను కూడా చూసింది. అంతేకాకుండా ఆమె రెండు NISM సర్టిఫికేషన్లు, ఒక SEBI సర్టిఫికేషన్ కూడా పొందింది.
రూ.13.9 లక్షల పెట్టుబడులు
ప్రస్తుతం సించన దాదాపు రూ.13.9 లక్షల పెట్టుబడులను నిర్వహిస్తోంది. ఆమె పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు, భారతీయ-అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నాయి. అయితే.. ఆమె తన పెట్టుబడులను తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తోంది. భవిష్యత్తులో తన మాస్టర్స్ చదువులకు ఈ డబ్బును ఉపయోగించుకోవాలనేది ఆమె లక్ష్యం.
మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడానికి సించన GDP అనే సులభమైన పద్ధతిని ఉపయోగిస్తుంది. జీడీపీ అంటే Growth, Direct, Passive. తనకు వెంటనే డబ్బు అవసరం లేకపోవడంతో గ్రోత్ ఫండ్స్ గురించి ఆలోచిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి డైరెక్ట్ ప్లాన్స్, మార్కెట్ సూచీలను అనుసరించే ప్యాసివ్ ఫండ్స్ అనుసరిస్తుంది.
సొంతగా కార్డ్ గేమ్
సించనకు చదువు పట్ల మాత్రమే కాకుండా.. ఆటల మీద కూడా ఎక్కువ ఆసక్తి. దీంతో తన 14 ఏళ్ల వయసులో NCERT సిలబస్ ఆధారంగా 'ఇతిహాస - ది రాయల్ గేమ్' అనే చరిత్ర ఆధారిత కార్డ్ గేమ్‌ను సృష్టించింది. ఈ గేమ్‌ను బెంగళూరులోని 36 ప్రభుత్వ పాఠశాలలకు అందించింది. ఆ ఆటను ఎలా ఉపయోగించాలో పాఠశాల ప్రిన్సిపాల్‌లకు శిక్షణ ఇచ్చింది.
లక్ష్యం ఇదే..
ఇప్పుడు ఆమె ఆర్థిక విషయాలపై మరో కార్డ్ గేమ్‌ను తయారు చేస్తోంది. ఇందులో పొదుపు, బ్యాంకింగ్, వడ్డీ, పెట్టుబడులు, బీమా, అప్పులు, మోసాల గురించి పిల్లలు సులభంగా నేర్చుకునేలా చేయాలని ఆమె ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో భారతదేశంలోని 10 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించాలనేది సిన్చన లక్ష్యం.
ఇదీ చదవండి: సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సూత్రాలు!


