హార్ముజ్‌ కోసం ట్రంప్‌–ఇరాన్‌ కీలక బేరం! | Trumps Hormuz Bargain With Iran | Sakshi
Sakshi News home page

హార్ముజ్‌ కోసం ట్రంప్‌–ఇరాన్‌ కీలక బేరం!

Sep 25 2026 7:18 AM | Updated on Sep 25 2026 7:22 AM

Trumps Hormuz Bargain With Iran

అమెరికా–ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు దశలవారీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని సడలిస్తే.. ఇరాన్‌ వ్యూహాత్మకమైన హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న అమెరికా–ఇరాన్‌ ఇప్పుడు ఒకే టేబుల్‌ వద్దకు వచ్చాయి. యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల చేతుల్లో ఉన్న రెండు బలమైన అస్త్రాలే ఇప్పుడు బేరసారాలకు వచ్చాయి. ఒకటి అమెరికా ఆంక్షలు.. మరొకటి ఇరాన్‌ చేతిలో ఉన్న హార్ముజ్‌ జలసంధి!

ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రధాన బేరసారాల అంశంగా మారింది. హార్ముజ్‌ ద్వారా నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. స్తంభించిన పరిస్థితిని దశలవారీగా పరిష్కరించడమే సాధ్యమైన మార్గమని ఇరాన్‌కు చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

ప్రతిపాదిత ఒప్పందంలో తొలి దశగా ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, దానికి ప్రతిగా టెహ్రాన్‌ హార్ముజ్‌ మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించడం ఉండొచ్చని ఆ కథనం తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ ఆస్తులను మోక్షం కల్పించే అంశాన్ని కూడా టెహ్రాన్‌ కోరవచ్చని తెలుస్తోంది.

ట్రంప్‌ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తే.. ఇరాన్‌ ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన జలమార్గాన్ని తెరవాలన్నది ప్రతిపాదన. అయితే ఇది తుది శాంతి ఒప్పందం కాకపోవచ్చని, గత జూలైలో కుదిరిన అవగాహన విఫలమైన నేపథ్యంలో ఈసారి ఇరు దేశాల రాయితీలు ఎంతకాలం అమల్లో ఉంటాయన్నదే కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హార్ముజ్‌ తెరవడానికి ఇరాన్‌ రెడీ.. కానీ!
అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్‌ నౌకాశ్రయాలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే వారం రోజుల్లోనే హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉందట. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా సెప్టెంబర్‌ 16న ట్రంప్‌ ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు చిక్కు ఇక్కడే ఉంది.

తమ వద్ద ఉన్న బలమైన బేరసారాల అస్త్రాన్ని ముందుగా వదులుకోవడానికి ట్రంప్‌ ప్రభుత్వం, ఇరాన్‌ రెండూ సిద్ధంగా లేవు. అమెరికా వద్ద ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధనం ప్రధాన ఒత్తిడి సాధనాలైతే.. ఇరాన్‌ చేతిలో హార్ముజ్‌ జలసంధి ఉంది. దీంతో ఎవరు ముందుగా మెట్టు దిగాలన్నదే చర్చల్లో కీలకంగా మారింది.

ట్రంప్‌ ఒత్తిడి.. ఇరాన్‌ ప్రతిఘటన
ట్రంప్‌ ప్రభుత్వం మాత్రం టెహ్రాన్‌పై ఒత్తిడి తగ్గించే సంకేతాలు ఇవ్వడం లేదు. ఇరాన్‌ చమురు ఎగుమతులను దెబ్బతీసే ఆంక్షలకు తోడు ఈ నెలలో ఆ దేశ వాణిజ్య విమానయాన సంస్థలు, వాటి సహాయక నెట్‌వర్క్‌లపైనా అమెరికా చర్యలు తీసుకుంది. ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు.

మరోవైపు ఇరాన్‌ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తమపై విధించిన ఆర్థిక, సైనిక ఒత్తిడిని ముందుగా తగ్గించాలని టెహ్రాన్‌ కోరుతోంది. ‘‘మా వేళ్లు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి’’ అని పదే పదే చెబుతూ వస్తుండడం.. పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో వెల్లడిస్తోంది.

ట్రాన్సిట్‌ ఫీజుపై ఇరాన్‌ మెట్టు దిగుతుందా?
హార్ముజ్‌ మీదుగా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్‌ ఫీజు వసూలు చేయాలన్న తన డిమాండ్‌ను ప్రధాన ఒప్పందం నుంచి పక్కన పెట్టేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ అంశాన్ని ప్రత్యేక అనుబంధంలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. గల్ఫ్‌ దేశాలు మాత్రం ఇలాంటి రుసుముల చెల్లింపును వ్యతిరేకిస్తున్నాయి.

అయితే ఫీజు అంశాన్ని పక్కన పెట్టడం అంటే.. హార్ముజ్‌పై తన నియంత్రణను ఇరాన్‌ వదులుకున్నట్లు కాదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రధాన డీల్‌లో మాత్రం ముందుగా హార్ముజ్‌ రాకపోకలను పునరుద్ధరించడంపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల తర్వాతే డీల్‌?
అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత అమెరికా–ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్‌ ఇప్పటికే చెప్పారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పుడు చర్చలు మళ్లీ వేగం పుంజుకోవడంతో.. ఎన్నికలకు ముందే ఏదైనా తాత్కాలిక అవగాహన కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇరాన్‌ మాత్రం తమ డిమాండ్ల జాబితా చాలా పెద్దదేనని సంకేతాలిస్తోంది. దీంతో ట్రంప్‌ ప్రభుత్వం ఎంత మేరకు ఆర్థిక ఆంక్షలను సడలిస్తుంది? దానికి ప్రతిగా ఇరాన్‌ హార్ముజ్‌పై ఎలాంటి హామీ ఇస్తుంది? అన్నదే కీలకంగా మారింది.

గల్ఫ్‌ దేశాలకూ టెన్షన్‌
అమెరికా–ఇరాన్‌ చర్చలను గల్ఫ్‌ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. హార్ముజ్‌పై ఇరాన్‌కు శాశ్వత నియంత్రణ కల్పించే ఏ ఒప్పందాన్నైనా అవి వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో యుద్ధం మరింత విస్తరించకుండా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే హార్ముజ్‌ కేవలం ఇరాన్‌–అమెరికా మధ్య బేరసారాల అంశం కాదు. ప్రపంచ ఇంధన రవాణాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ఈ జలసంధిలో నౌకల రాకపోకలు సాధారణ స్థితికి వస్తే అంతర్జాతీయ చమురు సరఫరాపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్‌–ఇరాన్‌ చర్చల్లో ఏ చిన్న పురోగతినైనా గల్ఫ్‌ దేశాలు, ఇంధన మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.

ఇదీ చదవండి: మీకు దణ్ణం పెడతాం.. ఏఐని ఆపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement