శత్రువుల్లా కాదు.. భాగస్వాములుగా పనిచేద్దాం!  | China, US should be partners rather than rivals says China President Jinping | Sakshi
Sakshi News home page

శత్రువుల్లా కాదు.. భాగస్వాములుగా పనిచేద్దాం! 

Sep 25 2026 5:14 AM | Updated on Sep 25 2026 5:14 AM

China, US should be partners rather than rivals says China President Jinping

అమెరికాకు చైనా అధ్యక్షుడి పిలుపు 

ఏకకాలంలో చైనా పునరుజ్జీవం, మాగా సాధ్యమని వెల్లడి 

మూడు రోజుల అమెరికా పర్యటన షురూ 

విమానాశ్రయంలో స్వాగతం పలికిన ట్రంప్‌ దంపతులు

వాషింగ్టన్‌: అమెరికా, చైనాలు ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా పనిచేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఇరుదేశాలు ఈ నవయుగంలో అందుకు తగ్గ మార్గాన్ని కనుక్కోగలవన్న ధీమాను వ్యక్తం చేశారు. అమెరికాలో మూడు రోజులపాటు పర్యటించనున్న జిన్‌పింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మేరిల్యాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో విమానం దిగిన జిన్‌పింగ్‌ దంపతులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భార్య మెలానియాలు స్వయంగా స్వాగతం పలికారు.

 అమెరికా రాక సందర్భంగా విడుదల చేసిన లిఖిత పూర్వక ప్రసంగంలో జిన్‌పింగ్‌ చైనా ప్రజల తరఫున అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు జాతీయ వార్తా సంస్థ షిన్హువా తెలిపింది. ఆ ప్రసంగంలోనే జిన్‌పింగ్‌ ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నారు. అంతేకాకుండా..చైనా, అమెరికాలు ప్రత్యర్థులుగా కాకుండా.. భాగస్వాములుగా ఉండాలని, చైనా పునరుజ్జీవం, ‘మేకింగ్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌’(మాగా) అన్న రెండు లక్ష్యాలను కలిసి సాధించగలమని తద్వారా ప్రపంచ శ్రేయస్సును మెరుగుపరచగలమని జిన్‌పింగ్‌ తెలిపారు.  

సహకారమే పునాదిగా చైనా, అమెరికాలు పనిచేయాలని, పోటీని, భేదాభిప్రాయాలను తగ్గించుకోవాలని, శాంతికి పెద్దపీట వేయాలని షీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. కాలం మారుతున్నా... ప్రపంచం వృద్ధి చెందుతున్నా చైనా, అమెరికాల మధ్య శాంతియుత సహజీవనం అన్న చారిత్రక తర్కంలో మాత్రం మార్పులేదని ఆయన తెలిపారు. అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలతోనూ సంప్రదింపులు జరిపి ఇరుదేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేస్తానని చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ద్వైపాక్షిక, ఇతర అంశాలపై లోతైన చర్చలు జరపనున్నామని, వివిధ రంగాల్లో సహకారానికి పెద్దపీట వేస్తామని షీ హామీ ఇచ్చారు. ఈ చర్చలు ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతికి సాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.  షీ జిన్‌పింగ్‌ 2015 తర్వాత అమెరికా రావడం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగే చర్చల్లో టారిఫ్‌ యుద్ధం, కృత్రిమ మేధస్సు, సైనిక సంబంధాలు, మధ్యప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్ల యుద్ధాలు, అంతరిక్ష ఆయుధపోటీ, తైవాన్‌కు అమెరికా ఆయుధాల వంటి అనేక అంశాలు చర్చకు రావచ్చునని అంచనా. ఈ ఏడాది మేలో ట్రంప్‌ చైనా పర్యటన సందర్భంగా చైనా, అమెరికాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వం కోసం నిర్మాణాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే విషయంపై ఏకాభిప్రాయం కుదిరిందని జిన్‌పింగ్‌ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఈ నిర్ణయం మార్గదర్శకత్వం వహించిందన్నారు.  

ఘర్షణకు దిగితే నష్టపోతాం: జిన్‌పింగ్‌ 
అమెరికా పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌కు చేరుకున్న చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ దంపతులకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు లాంఛనంగా స్వాగతం పలికారు. సైనిక బృందం సంగీతం వినిపిస్తుండగా, ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా వైట్‌హౌస్‌ సౌత్‌ పోర్టీకో వద్ద జిన్‌పింగ్, పెంగ్‌ లియువాన్‌లకు స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ‘బీస్ట్‌’వాహనానికి సమానమైన నలుపు రంగు హాంగ్‌కీ (రెడ్‌ ఫ్లాగ్‌) ఎన్‌701 కారులో చైనా అధినేత శ్వేతసౌధానికి విచ్చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం ప్రారంభంలో ట్రంప్‌ కొద్దిసేపు మాట్లాడారు. 

‘‘రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడానికి మన ప్రజలు ఎలాగైతే కలిసి పనిచేశారో, అలాగే మన రెండు దేశాలకు మెరుగైన భవిష్యత్తును నిర్మించేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్, నేను కలిసి పనిచేయడం కొనసాగిస్తాం’’అని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ‘‘చైనా, అమెరికా వంటి రెండు ప్రధాన దేశాలు సహకారం ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఘర్షణకు దిగితే రెండూ నష్టపోతాయి’’అని స్పష్టంచేశారు.  మనం పోటీ గురించి ప్రస్తావించడాన్ని మానుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ, ఆ పోటీ ఆరోగ్యకరమైనదిగా, హద్దులకు లోబడి ఉండాలని సూచించారు. ఇది ఒకరినొకరు అధిగమించేందుకు చేసే పోటీలా ఉండాలి తప్ప ఒకరు గెలిచి మరొకరు ఓడిపోయేలా సాగే కుస్తీ పోరులా ఉండకూడదని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement