భారత స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల పరంపర | Major Reasons Behind Stock Market Crash Today | Sakshi
Sakshi News home page

భారత స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల పరంపర

Oct 28 2026 4:15 PM | Updated on Oct 28 2026 4:26 PM

Major Reasons Behind Stock Market Crash Today

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బుధవారం నాటి ట్రేడింగ్ ముగింపు సమయానికి భారతీయ బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్‌ సెషన్‌ ముగిసే సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ 352 పాయింట్లు కోల్పోయి 73,246 స్థాయికి పడిపోగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,698 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం మదుపర్లను ఆందోళనకు గురిచేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు

ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న ప్రధాన పరిణామం ముడి చమురు ధరల పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ఏకంగా 115 డాలర్ల మార్కును దాటింది. పశ్చిమాసియాలో చెలరేగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్న భయాలు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. భారత్ తన అవసరాల కోసం దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు ఈ స్థాయిలో ఎగబాకడం దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా, కరెంట్ అకౌంట్ లోటును మరింత తీవ్రతరం చేస్తుందనే ఆందోళనలు పెట్టుబడిదారులలో నెలకొన్నాయి.

ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి

దేశీయంగా టెక్నాలజీ దిగ్గజాల షేర్లలో లాభాల స్వీకరణ జోరుగా సాగింది. ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఇంకా స్పష్టత రాకపోవడం, ఏఐ టెక్నాలజీ వేగవంతమైన పరిణామాలపై నెలకొన్న అనిశ్చితి ఐటీ రంగాన్ని కోలుకోలేకుండా చేశాయి. అమెరికా మార్కెట్లలో టెక్‌ స్టాక్స్‌ కదలికలు కూడా మన దేశీయ ఐటీ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

అమెరికా ఫెడ్ రిజర్వ్ భయాలు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే వడ్డీ రేట్ల విధానంపై మదుపర్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో ఫెడ్ వడ్డీ రేట్ల కోతను ఆలస్యం చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనివల్ల అమెరికా బాండ్ ఈల్డ్స్ బలపడి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎమర్జింగ్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని సురక్షితమైన అమెరికా అసెట్ల వైపు మళ్లుతున్నారు. ఇదే క్రమంలో విదేశీ సంస్థాగత మదుపర్లు భారత మార్కెట్లలో నిలకడగా అమ్మకాలకే మొగ్గు చూపుతుండటం సూచీల పతనానికి మరో ప్రధాన కారణమైంది.

ఇదీ చదవండి: 120 కి.మీ వేగంతో వెళ్లినా చలాన్లు ఉండవు! కానీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement