అంతర్జాతీయ ఆర్థిక, దేశీయ బులియన్ (బంగారం) మార్కెట్లలో సింగపూర్ మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు, సార్వభౌమ సంస్థలు(సావరీన్ ఎంటిటీస్), అంతర్జాతీయ ఆర్థిక సంస్థల కోసం ఏకంగా 500 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక గోల్డ్ వాల్ట్ సర్వీస్‌ను సింగపూర్ మోటరీ అథారిటీ (ఎంఏఎస్)ని అధికారికంగా ప్రారంభించింది. ఆసియా ఖండంలోనే ఫైనాన్షియల్ హబ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో చర్చనీయాంశమైంది.
మౌలిక వసతులు.. పన్ను రాయితీలు
ఈ సరికొత్త జాతీయ వాల్ట్ ప్రారంభంతో పాటు బులియన్ ట్రేడింగ్ రంగానికి ఊతమిచ్చేలా పన్ను మినహాయింపులను కూడా సింగపూర్ ప్రకటించింది. గోల్డ్ కస్టడీ, రిఫైనింగ్, రీ-మెల్టింగ్, అసేయింగ్, బ్రోకింగ్ వంటి టోకు సేవలకు ట్యాక్స్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థాగత వర్తకుల మధ్య ఈ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నందున పన్ను సులభతర విధానం తీసుకువచ్చినట్లు ఎంఏఎస్ ఛైర్మన్ గన్ కిమ్ యోంగ్ మీడియా సమావేశంలో తెలిపారు.
హాంకాంగ్‌తో పోటీ
ఆసియాలో అగ్రగామి గోల్డ్ హబ్‌గా నిలిచేందుకు సింగపూర్, హాంకాంగ్ నగరాల మధ్య పోటీ తీవ్రతరమవుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. సింగపూర్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌జీఎక్స్) కూడా భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా 2027 రెండో త్రైమాసికంలో భౌతికంగా డెలివరీ చేయదగిన ఒక కేజీ బంగారం బార్ ఫ్యూచర్స్‌ను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) గోల్డ్ క్లియరింగ్ సిస్టమ్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెచ్చి 2027 మార్చి నాటికి పూర్తి స్థాయి ట్రేడింగ్‌ను ప్రారంభించనున్నట్లు మార్కెట్ వర్గాలు నివేదించాయి.
ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఈ చర్యల ద్వారా సింగపూర్‌లో నూతన ఉద్యోగావకాశాలు రావడంతో పాటు ఆర్థిక రంగం మరింత మెరుగవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆసియాకు, ప్రపంచ పశ్చిమ దేశాల గోల్డ్ మార్కెట్లకు మధ్య సింగపూర్ ఒక నమ్మకమైన వారధిలా మారుతుందని, ఇది రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పసిడి ధరల సరళిని, నిల్వ కేంద్రాల కేంద్రీకరణను శాసించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రత, పన్ను ప్రయోజనాలు ఉన్న సింగపూర్ వైపు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్‌లను తరలించేందుకు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఎందుకో ఆ రైలు తొందరపడింది!


