దేవుడికి కానుకగా బంగారు గుండె.. ఎందుకంటే? | a golden heart worth over 3 lakh rupees was offered to Lord Sanwalia | Sakshi
Sakshi News home page

దేవుడికి కానుకగా బంగారు గుండె.. ఎందుకంటే?

Nov 7 2026 7:16 PM | Updated on Nov 7 2026 7:34 PM

a golden heart worth over 3 lakh rupees was offered to Lord Sanwalia

జైపూర్‌: రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు తన గుండె శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సంబరపడుతూ, చిత్తోర్‌గఢ్‌లోని ప్రసిద్ధ సాంవలియా సేఠ్ ఆలయానికి 21 గ్రాముల బంగారంతో తయారు చేసిన హృదయాన్ని కానుకగా సమర్పించాడు. దీని విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేశారు.

జలోర్ జిల్లాకు చెందిన ఈ భక్తుడు కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స సమయంలో ఆరోగ్యంగా కోలుకోవాలని సాంవలియా సేఠ్‌ను ప్రార్థించాడు. తనకు నయం అయితే బంగారంతో చేసిన హృదయాన్ని స్వామివారికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. చికిత్సతో పాటు శస్త్రచికిత్స కూడా విజయవంతం కావడంతో తన మొక్కును తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మేవాడ్ ప్రాంతంలోని ప్రముఖ కృష్ణక్షేత్రమైన శ్రీ సాంవలియాజీ ఆలయానికి చేరుకుని బంగారు హృదయాన్ని సమర్పించాడు.

భక్తుడు ఈ బంగారు హృదయాన్ని ఆలయంలోని కానుకల స్వీకరణ కార్యాలయంలో అధికారులకు అందజేశాడు. ఇందుకు సంబంధించి ఆలయ మండలి నుంచి రసీదు కూడా పొందాడు. సాధారణంగా భక్తులు ఆలయాలకు బంగారం, వెండి ఆభరణాలు, కిరీటాలు, హారాలు, ఇతర విలువైన వస్తువులను కానుకలుగా సమర్పిస్తుంటారు. అయితే గుండె శస్త్రచికిత్స విజయవంతమైన తర్వాత కృతజ్ఞతగా హృదయ ఆకారంలో బంగారు నమూనాను సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. సాంవలియా సేఠ్‌పై తనకున్న భక్తిని ఈ విధంగా చాటుకున్నాడు ఆ భక్తుడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement