ప్రైవేటు పెట్టుబడులకు భారీ అవకాశాలు
అంతరిక్ష రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
ప్రధాని మోదీ నిర్ణయంతో ప్రైవేటు రంగానికి కొత్త దారులు
నియంత్రణ అనుమతులు వేగవంతం చేయాలి
బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరం సమావేశంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రాబోయే ఏడెనిమిదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించనుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం 9 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఏడెనిమిదేళ్లలో 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు పెట్టుబడులకు తెరవడం ద్వారా దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.
న్యూఢిల్లీలో శనివారం బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నిర్వహించిన ‘స్పేస్, సార్వ¿ౌమత్వం, నూతన ఆర్థిక వ్యవస్థ’అంశంపై జరిగిన మీడియా రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతరిక్ష సాంకేతికతలో సామర్థ్యాలను ప్రదర్శించే స్థాయి నుంచి, ప్రపంచ మార్కెట్లలో పోటీపడగల వాణిజ్య సంస్థలను నిర్మించే దిశగా భారత్ అడుగులు వేయాలని సూచించారు.
ప్రైవేటు రంగానికి ప్రోత్సాహంతో కొత్త అవకాశాలు
ప్రధాని మోదీ నాయకత్వంలో 2019–2020 సమయంలో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి మార్గం సుగమం చేయడం మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. గత ఐదారు సంవత్సరాల్లోనే ఈ రంగంలో గణనీయమైన పురోగతి కనిపించిందని చెప్పారు. అంతరిక్ష రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కలిసి పనిచేస్తే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల వ్యాపారాలను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఇప్పటివరకు సాధించిన సాంకేతిక విజయాలను వాణిజ్యపరంగా లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చుకోవడం ఇప్పుడు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
పెట్టుబడులకు స్థిరమైన డిమాండ్...
ప్రైవేటు అంతరిక్ష సంస్థలు అభివృద్ధి చెందాలంటే వాటి ఉత్పత్తులు, సేవలకు నిరంతర డిమాండ్ ఉండాలని మంత్రి అభిలషించారు. ప్రభుత్వ సంస్థలు ప్రధాన వినియోగదారులుగా వ్యవహరించడం, ప్రయోగాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ద్వారా కొత్త సంస్థలకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఉత్పత్తులకు కొనుగోలుదారులు ఉంటారనే నమ్మకం ఏర్పడితే కంపెనీలు తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మార్కెట్‌కు అనుగుణమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, దీర్ఘకాలిక ఆదాయ మార్గాలను సృష్టించుకోవడానికి ముందుకు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ మద్దతుతో ప్రారంభమయ్యే ప్రాజెక్టులు ప్రైవేటు సంస్థలు వాణిజ్య కార్యకలాపాలను విస్తరించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
వ్యాపార వ్యయాలు తగ్గాలి...
అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెరగాలంటే నియంత్రణపరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. సంస్థలు కీలక ఉపకరణాల సమీకరణతోపాటు ఎగుమతుల కోసం అవసరమైన లైసెన్సులు, అనుమతులను నిరీ్ణత కాలవ్యవధిలో పొందేలా వ్యవస్థ ఉండాలని అన్నారు. వ్యాపార నిర్వహణ వ్యయాలను తగ్గించడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, అంతరిక్ష ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీ వంటి అంశాల్లో చేపట్టే సంస్కరణలు పరిశ్రమలకు ఆచరణాత్మక ప్రయోజనాలను అందించేలా చూడాలని పేర్కొన్నారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాలు...
భారత్ స్వదేశీ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అవకాశాలను విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. పెట్టుబడులు పెరిగితే సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, పరికరాల తయారీ, ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడం సులభమవుతుందని అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి స్వదేశీ సామర్థ్యాలు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, విదేశీ భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేస్తే భారతీయ కంపెనీలు ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో భాగస్వాములుగా మారి, కొత్త మార్కెట్లలో తమ ఉనికిని పెంచుకోగలవని చెప్పారు.
వ్యవసాయం నుంచి విపత్తుల నిర్వహణ వరకు...
అంతరిక్ష రంగం ప్రాధాన్యం కేవలం రాకెట్లు, ఉపగ్రహాల ప్రయోగాలకే పరిమితం కాదని మంత్రి అన్నారు. భూమిపై ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలోనూ అంతరిక్ష సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, జియోస్పేషియల్ టెక్నాలజీ), భూమి పరిశీలన ఉపగ్రహాల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్మాణ ప్రాజెక్టుల పర్యవేక్షణ, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, రక్షణ రంగాలకు ప్రయోజనాలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను పరిశీలించడం, పనుల పురోగతిని పర్యవేక్షించడం, అభివృద్ధి కార్యక్రమాలకు జియోట్యాగింగ్ చేయడం వంటి అంశాల్లోనూ అంతరిక్ష సాంకేతికత ఉపయోగపడుతోందని చెప్పారు.
మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలకు సైతం విపత్తుల నిర్వహణలో ఉపగ్రహ ఆధారిత సమాచారం, సహకారాన్ని భారత్ అందిస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సేవల్లో విస్తతంగా ఉపయోగించడంతో ప్రభుత్వ కార్యక్రమాల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కొత్త వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన సాంకేతిక విజయాలను వాణిజ్యపరంగా విజయవంతమైన సంస్థలుగా మార్చడమే తదుపరి దశలో ప్రధాన సవాళ్లు అని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతరిక్ష సేవలు, డేటా ఆధారిత పరిష్కారాలు, పారిశ్రామిక అనువర్తనాలు భవిష్యత్తులో ఈ రంగం విస్తరణకు కీలకంగా మారతాయని తెలిపారు.


